job hirings: ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ టాప్!
job hirings: దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను వెనక్కి నెట్టి వైట్ కాలర్ ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.
job hirings: ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ టాప్!
Naukri report: దేశ ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ వంటి మహానగరాలను సైతం వెనక్కి నెట్టి ఉపాధి కల్పనలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే వైట్ కాలర్ ఉద్యోగ నియామకాల్లో భాగ్యనగరం నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరి.కామ్ విడుదల చేసిన తాజా జాబ్‌స్పీక్ నివేదిక ఈ అద్భుత విషయాన్ని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో ఉద్యోగ నియామకాలు ఏకంగా 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదే సమయంలో జాతీయస్థాయిలో నియామకాల వృద్ధి కేవలం 2 శాతంగానే పరిమితం కావడం గమనార్హం. అంటే జాతీయ సగటు కంటే మన హైదరాబాద్ ఎంతో ముందంజలో ఉందన్నమాట!
నౌకరి నివేదిక ప్రకారం... హైదరాబాద్ (9%) తర్వాత స్థానాల్లో చెన్నై (6%), బెంగళూరు (4%), కోల్‌కతా (4%) నగరాలు సానుకూల వృద్ధిని కనబరిచాయి. పుణెలో నియామకాలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగాయి. అయితే, దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్‌సీఆర్)లో మాత్రం ఉద్యోగ అవకాశాలు 6 శాతం మేర క్షీణించడం గమనార్హం.
రంగాల వారీగా విశ్లేషిస్తే మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉందనే స్పష్టత వస్తుంది. ప్రస్తుత టెక్నాలజీ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో అత్యధికంగా 20 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు, పండుగల సీజన్ డిమాండ్, ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం 11 శాతం వృద్ధిని సాధించి దూసుకెళ్తోంది. అయితే, ఐటీ-సాఫ్ట్‌వేర్ (-4%), ఫార్మా (-4%), హాస్పిటాలిటీ (-11%), విద్యా రంగం (-18%) వంటి కొన్ని కీలక రంగాల్లో మాత్రం నియామకాలు కొంత తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుత నియామక మార్కెట్‌లో కంపెనీలు సరికొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. ప్రెషర్ల కంటే అనుభవజ్ఞులకే కంపెనీలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. 13 నుంచి 16 ఏళ్ల మధ్య అనుభవం ఉన్న సీనియర్ నిపుణులకు డిమాండ్ ఏకంగా 7 శాతం పెరిగింది.అదే సమయంలో ఫ్రెషర్ల నియామకాలు కేవలం ఒక శాతం మాత్రమే వృద్ధి చెందగా... 4-7 ఏళ్ల అనుభవం ఉన్న మిడ్-లెవల్ విభాగంలో నియామకాలు 2 శాతం మేర క్షీణించాయి. మొత్తానికి, సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లోనూ ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూ హైదరాబాద్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. టెక్నాలజీ , ఆటోమొబైల్ రంగాల జోరుతో ఉద్యోగార్థులకు భాగ్యనగరం కేరాఫ్ అడ్రస్‌గా మారుతుండటం శుభపరిణామం.




