Uday Krishna Reddy: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణ కోసం రంగంలోకి స్పెషల్ టీమ్స్..
Uday Krishna Reddy: హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) లో కలకలం రేపిన మహిళా ట్రైనీ ఐపీఎస్..
tranee-IPS-Uday-Krishna
Uday Krishna Reddy: హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) లో కలకలం రేపిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు సహకరించకుండా పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. చట్టాన్ని పరిరక్షించాల్సిన ఉన్నత అధికారి హోదాలో ఉండి, విచారణ నుంచి తప్పించుకునేందుకు ముఖం చాటేయడం పోలీస్ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రెండు అడ్రస్లలోనూ ఆచూకీ గల్లంతు..
బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణను వేగవంతం చేసిన పోలీసులు, ఉదయ్ కృష్ణారెడ్డికి చట్టపరమైన నోటీసులు అందజేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన ఆఫీషియల్ రికార్డులలో పేర్కొన్న రెండు శాశ్వత చిరునామాలకు వెళ్లిన పోలీసులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఆ రెండు అడ్రస్లలోనూ ఉదయ్ కృష్ణారెడ్డి లేకపోవడంతో పాటు, ఆయన ఎక్కడికి వెళ్లారనే సమాచారం కూడా లభించలేదు. దీంతో ఆయన పక్కా ప్లాన్‌తోనే విచారణకు భయపడి పరారైనట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక ముగింపునకు వచ్చారు.
రంగంలోకి స్పెషల్ టీమ్స్.. ముమ్మరంగా వేట
ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుండటంతో ఆయనను పట్టుకునేందుకు ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఆయన ఆచూకీ కనిపెట్టడమే లక్ష్యంగా పలు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ స్పెషల్ టీమ్స్ గత రెండ్రోజులుగా పలు అనుమానిత ప్రాంతాల్లో, ఆయన సన్నిహితులు , స్నేహితుల వద్ద ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఆయన కాల్ డేటా, లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ త్వరలోనే అదుపులోకి తీసుకునేందుకు ఖాకీలు వేగంగా పావులు కదుపుతున్నారు.
కఠిన చర్యలకు సిఫార్సు.?
మరోవైపు జాతీయ పోలీస్ అకాడమీ పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ కూడా దృష్టి సారించినట్లు సమాచారం. దేశంలోనే అత్యున్నత శిక్షణ పొందే కేంద్రంలో ఇలాంటి లైంగిక వేధింపుల ఘటన వెలుగుచూడటం, నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి పరారీలో ఉండటాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి పట్టుబడిన వెంటనే ఆయనపై చట్టపరమైన క్రిమినల్ చర్యలతో పాటు, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయి.




