HYDRAA: ఐలాపురంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు స్టే లేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ!
HYDRAA: అమీన్పూర్ మండలం ఐలాపూర్ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వివరణ ఇచ్చారు. హైకోర్టు స్టే ఇచ్చిందన్న వార్తలను ఆయన ఖండించారు.
HYDRAA: ఐలాపురంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు స్టే లేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ!
HYDRAA: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో శనివారం జరిగిన హైడ్రా (HYDRAA) కూల్చివేతల ఉదంతంపై కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు.
భూ కబ్జాపై రంగనాథ్ వివరణ:
ఐలాపూర్ భూములకు సంబంధించి 1998 నుంచే హైకోర్టు స్టేటస్ కో (యథాతథ స్థితి) ఉందని రంగనాథ్ గుర్తు చేశారు. ఈ క్రమంలో ముఖీమ్ అనే వ్యక్తి ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన వివరించారు. 2006లో నిర్మించిన ఒక ఫాంహౌస్‌ను కేంద్రంగా చేసుకుని, ముఖీమ్ సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని కమిషనర్ తెలిపారు.
గత 20 ఏళ్లుగా తన అనుచరులతో కలిసి భూదందా చేస్తున్న ముఖీమ్, ప్రభుత్వ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించాడని చెప్పారు. 100 గజాల స్థలాన్ని రూ.10 లక్షల చొప్పున పేదలకు అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించారని పేర్కొన్నారు.
"ఐలాపూర్ అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ జరిగిన నిర్మాణాలను మాత్రమే మేము తొలగించాం. సామాజిక మాధ్యమాల్లో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు" అని రంగనాథ్ స్పష్టం చేశారు.
శనివారం ఉదయం నుంచి రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ముఖీమ్ అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేసింది. ప్రభుత్వ భూములను ఆక్రమించి సామాన్యులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.




