Illanthakunta: రాములోరి పెళ్లి వేడుకకు పోటెత్తిన భక్తజనం!

Illanthakunta: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 5:01 PM IST
Illanthakunta
X

Illanthakunta: రాములోరి పెళ్లి వేడుకకు పోటెత్తిన భక్తజనం!

కరీంనగర్: ఆశేష భక్తజనం.. వేదమంత్రాలు తాళాలు తప్పట్ల మధ్య సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కరీంనగర్ జిల్లా నుంచియే కాక వరంగల్ హనుమకొండతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు.

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం కనుల పండువగా సాగింది. భద్రాచలం తర్వాత రెండవ అతిపెద్ద కళ్యాణ మహోత్సవం ఇల్లందకుంటలో జరుగుతుండడంతో జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణానికి తరలివచ్చారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే దంపతులు..

రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు పూలమాలలు సమర్పించారు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పూలమాలలు సమర్పించారు. వారంతా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణం నిర్వహించారు.

ప్రతి ఏట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. ప్రతిఘట్టం భక్తులను ఆకట్టుకుంది. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది.మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తదితరులు స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు. వేలాదిమంది భక్తులు దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు..

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. కళ్యాణం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వి విఐపి లు ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం షామియానాలు, చలువ పందిళ్ళు భారీకేడ్లు, కార్పెట్లు ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, తాగునీటి వసతి కల్పించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వివిధ మార్గాల ద్వారా కళ్యాణానికి హాజరయ్యే భక్తుల కోసం పలు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు, ఏసిపి మాధవి, దేవస్థానం ఈవో సుధాకర్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పలువురు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story