Illegal Sand Mafia: మిర్యాలగూడలో ఇసుక మాఫియా దందా.. బ్లాక్ మార్కెట్‌లో టన్ను రూ.7వేలు

Illegal Sand Mafia: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఏపీ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ బ్లాక్ మార్కెట్‌లో టన్ను రూ.7వేల వరకు అమ్ముతున్నట్లు ఆరోపణలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 March 2026 11:47 AM IST
Illegal Sand Mafia: మిర్యాలగూడలో ఇసుక మాఫియా దందా.. బ్లాక్ మార్కెట్‌లో టన్ను రూ.7వేలు
X

Illegal Sand Mafia: మిర్యాలగూడలో ఇసుక మాఫియా దందా.. బ్లాక్ మార్కెట్‌లో టన్ను రూ.7వేలు

Illegal Sand Mafia: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాలు ప్రస్తుతం ఇసుక మాఫియాకు కేంద్రంగా మారుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నుంచి భారీగా ఇసుకను అక్రమంగా తెలంగాణలోకి తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో వందల సంఖ్యలో లారీలు సరిహద్దులు దాటి ఇసుకను తీసుకువస్తున్నాయని సమాచారం.

ఈ అక్రమ రవాణా సమయంలో సరైన వే బిల్లులు, మైనింగ్ పర్మిట్లు లేకుండానే ఇసుక తరలింపులు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల కళ్లముందే ఈ దందా సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇసుక అక్రమ రవాణా వెనుక కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వారి అనుచరులే లారీలను సరిహద్దులు దాటేలా సహకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిబంధనల ప్రకారం ఒక్కో లారీలో పరిమితి మేరకు ఇసుక ఉండాలి. కానీ, కొన్ని లారీల్లో 40 నుంచి 60 టన్నుల వరకు ఓవర్‌లోడ్ చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోంది.

ఇక పోలీసుల పాత్రపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక లారీలను పట్టుకున్నప్పటికీ, కొన్ని గంటల్లోనే వాటిని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులు నమోదు చేయకుండా కేవలం జరిమానాలతో సరిపెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ అక్రమ దందా ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా పడుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఇసుక అందుబాటులో ఉండాల్సి ఉండగా, మాఫియా సృష్టించిన కొరతతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా రూ.3,970 ఉండాల్సిన టన్ను ఇసుక ధర బ్లాక్ మార్కెట్‌లో రూ.7,000 వరకు చేరింది. దీంతో ఇళ్లు నిర్మించుకునే మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక మైనింగ్ మరియు రెవెన్యూ శాఖల పనితీరుపై కూడా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల్లో నిఘా పెంచాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అక్రమ రవాణా వల్ల ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల రాయల్టీ ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే స్థానిక డీఎస్పీ రాజశేఖరరాజు మాత్రం అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన దాడుల్లో 64 కేసులు నమోదు చేసి 4 లారీలు, 60 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రకృతి సంపద అయిన ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందా? లేక ఈ మాఫియాకు అడ్డుకట్ట పడుతుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story