Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మరో వారం పాటు దంచికొట్టనున్న వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో వారం పాటు వర్షాలు కురవనున్నాయి.

CR Reddy
Published on: 9 Aug 2026 8:44 AM IST
Weather Update
X

Weather Update

Weather Update: ఈ వర్షాకాలం ప్రారంభం నుంచి తెలుగు రాష్ట్రాలపై వరుణుడి కరుణ అంతంత మాత్రమే ఉండి, వర్షాలు కాస్త మందకోడిగానే సాగాయి. అయితే గత వారం రోజులుగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. రైతాంగానికి, సాధారణ ప్రజలకు ఊరటనిస్తూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరొక బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి ప్రస్తుతం అల్పపీడనంగా మారింది. ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు విస్తరించి ఉంది. రాబోయే రోజుల్లో ఇది పశ్చిమ దిశగా కదులుతూ మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వచ్చే ఏడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. వర్షపాతంతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, వాహనదారులు, సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణలో వర్షాలు కురిసే జిల్లాలు ఇవే

తెలంగాణ విషయానికి వస్తే, నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ - మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి - భువనగిరి, హన్మకొండలోని కొన్ని భాగాలు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో నేటి వాతావరణ పరిస్థితి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయి. సాయంత్రం వేళ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగి అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో మాత్రం వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, అక్కడ ప్రధానంగా పొడి వాతావరణమే నెలకొంటుందని స్పష్టం చేసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story