Postal Dept : పోస్టాఫీస్ ఇప్పుడు సూపర్ ఫాస్ట్.. అత్యవసర పార్శిళ్ల కోసం సరికొత్త సర్వీస్

Postal Dept : తెలంగాణ పోస్టల్ సర్కిల్ నేడు 24 స్పీడ్ పోస్ట్ సర్వీసును ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు 6 మెట్రో నగరాలకు మరుసటి రోజే డెలివరీ, ఓటీపీ సెక్యూరిటీ, లేట్ అయితే మనీ బ్యాక్ గ్యారెంటీ ఇస్తారు.

CR Reddy
Published on: 17 March 2026 9:29 AM IST
Telangana Postal
X

Telangana Postal

Postal Dept : తెలంగాణ పోస్టల్ శాఖ వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. అత్యవసరంగా అందాల్సిన పార్శిళ్లు, డాక్యుమెంట్ల కోసం 24 స్పీడ్ పోస్ట్(24 Speed Post) పేరుతో సరికొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసును నేడు, మార్చి 17, 2026 మంగళవారం ప్రారంభించింది. ఈ సేవల ద్వారా మీరు పంపే వస్తువులు కేవలం 24 గంటల్లోనే, అంటే మరుసటి రోజుకే గమ్యస్థానానికి చేరుకుంటాయి. సమయానికి విలువ ఇచ్చే నేటి కాలంలో ఇండియా పోస్ట్ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకే కాకుండా వ్యాపార వర్గాలకు పెద్ద ఊరటనిస్తోంది.

ఏ నగరాల్లో అందుబాటులో ఉంది?

తొలి దశలో భాగంగా ఈ సేవలను హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల మధ్య అందుబాటులోకి తెచ్చారు. అంటే మీరు హైదరాబాద్ నుంచి ఈ నగరాలకు పంపే పార్శిళ్లు మరుసటి రోజుకే అక్కడ డెలివరీ అవుతాయి. ఈ సేవలను మరింత మందికి చేరువ చేసేందుకు హైదరాబాద్ సిటీ డివిజన్ పోస్టల్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఫీచర్లు అదుర్స్.. అదిరిపోయే సెక్యూరిటీ

ఈ 24 స్పీడ్ పోస్ట్ కేవలం వేగం మాత్రమే కాదు, భద్రతకు కూడా పెద్దపీట వేసింది. పార్శిల్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ఆధారిత వెరిఫికేషన్ ఉంటుంది. దీనివల్ల వస్తువు సరైన వ్యక్తికే అందుతుందనే భరోసా ఉంటుంది. అంతేకాకుండా ఎస్ఎంఎస్ (SMS) అలర్ట్స్ ద్వారా మీ పార్శిల్ ఎక్కడుందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. వ్యాపారస్తుల కోసం బుక్ నౌ - పే లేటర్ (BNPL) సదుపాయాన్ని కూడా కల్పించారు. బల్క్ బుకింగ్స్ చేసే వారికి ఫ్రీ పికప్ సౌకర్యం కూడా ఉంటుంది.

డబ్బులు వెనక్కి ఇచ్చే గ్యారెంటీ

అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవేళ పోస్టల్ శాఖ వాగ్దానం చేసినట్లుగా నిర్ణీత సమయంలో డెలివరీ చేయడంలో విఫలమైతే, కస్టమర్లకు మనీ బ్యాక్ గ్యారెంటీ (Money-back guarantee) కింద రుసుమును తిరిగి చెల్లిస్తారు. ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోటీగా ఇండియా పోస్ట్ ఈ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురావడం విశేషం. అత్యాధునిక ఏపీఐ (API) ఇంటిగ్రేషన్, కేంద్రీకృత బిల్లింగ్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నారు.

CR Reddy

CR Reddy

Next Story