Indiramma Indlu Phase 2: గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం.. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

Indiramma Indlu Phase 2: తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలుపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Arun Chilukuri
Published on: 17 Jun 2026 4:56 PM IST
Indiramma Indlu Phase 2
X

Indiramma Indlu Phase 2: గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం.. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

Indiramma Indlu Phase 2: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేద లబ్ధిదారులందరికీ సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యవసర టెలికాన్ఫరెన్స్‌లో.. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలుపై ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. గుడిసెల వాసులందరికీ ఇళ్లు మంజూరు చేసిన తర్వాతే ఇతర దరఖాస్తులను పరిశీలిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధప్రాతిపదికన గుర్తించేందుకు ప్రత్యేక క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

గతంలో 'ప్రజాపాలన' కార్యక్రమంలో తాము గుడిసెల వాసులమని దరఖాస్తు చేసుకున్న సుమారు 75 వేల మంది వివరాలను నిశితంగా పరిశీలించనున్నారు. ఒకవేళ గతంలో దరఖాస్తు చేసుకోని గుడిసెల వాసులు ఎవరైనా ఉంటే, వారు తమ పరిధిలోని ఎంపీడీవో (MPDO) కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. అర్హుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదని సూచించారు.

రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నారు. లబ్ధిదారులే స్వయంగా తమ ఇంటిని నిర్మించుకునేలా బీఎల్‌సీ (BLC) విధానాన్ని అమలు చేయనున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో స్థలాభావం మరియు అవసరాలను బట్టి గ్రౌండ్ ప్లస్ వన్ (G+1) నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు.

ఇళ్ల నిర్మాణంతో పాటు 'రూఫ్ రీప్లేస్‌మెంట్' పథకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 50,000 ఇళ్లను ఎంపిక చేయనున్నారు. (ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున కేటాయింపు).

టార్పాలిన్ షీట్లు, రేకులు, నాపరాళ్ల పైకప్పులతో ఇబ్బందులు పడుతూ నివసిస్తున్న కుటుంబాలకు ఇందులో ప్రాధాన్యత ఉంటుంది.

పటిష్టమైన ఆర్‌సీసీ (RCC) స్లాబ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు.

గత ప్రభుత్వాల హయాంలో పాత ఇందిరమ్మ ఇళ్లు, గృహలక్ష్మి పథకం కింద నిధులు అందక అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను కూడా ఈ విడతలో పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు. వాటిని గుర్తించి తగిన సహాయం అందించి పూర్తి చేయిస్తామన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో పేదల సొంతింటి కలలను నిజం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story