Indiramma Life Insurance Scheme: రూ.5 లక్షల జీవిత బీమా పొందాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు

Indiramma Life Insurance Scheme: తెలంగాణలోని కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం (నవంబర్ 19) ప్రారంభిస్తోంది.

Arun Chilukuri
Published on: 18 Nov 2026 12:02 PM IST
Indiramma Life Insurance Scheme
X

Indiramma Life Insurance Scheme: రూ.5 లక్షల జీవిత బీమా పొందాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు

Indiramma Life Insurance Scheme: తెలంగాణలోని కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న సార్వత్రిక జీవిత బీమా పథకం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ గురువారం (నవంబర్ 19) ప్రారంభం కానుంది. ఈ పథకం అమలుపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మహానగర పాలక సంస్థల కమిషనర్లకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

అర్హతలు మరియు వయోపరిమితి నిబంధనలు:

ప్రతి కుటుంబంలో సంపాదించే ఒక వ్యక్తి పేరిట ఈ బీమాను నమోదు చేస్తారు. ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మంది సంపాదిస్తున్నప్పటికీ, కేవలం ఒకరి పేరిట మాత్రమే నమోదు చేసుకునే వీలుంటుంది. ఎవరిని నమోదు చేయాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాలి.

18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన (అనగా 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించినవారు) సంపాదించే వ్యక్తులను నమోదు చేయాలి. జనన ధ్రువీకరణకు ఆధార్ కార్డులోని తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు.

దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. నమోదు పూర్తయిన తర్వాత బీమా పొందిన వ్యక్తి గరిష్ఠ వయోపరిమితిని దాటినప్పటికీ, కనీసం ఒక సంవత్సరం పాటు పూర్తి బీమా కవరేజీ వర్తిస్తుంది.

నమోదు ప్రక్రియ, శిబిరాల నిర్వహణ ఇలా:

అర్హత కలిగిన ప్రతి కుటుంబం సులభంగా పథకంలో చేరేలా గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక సహాయక నమోదు శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. శిబిరాల నిర్వహణకు రెండు రోజుల ముందు నుంచే దండోరా, ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాలు/నగరాల్లో వార్డు అధికారి శిబిర ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు. వీరితో పాటు ఒక హెల్ప్ డెస్క్ ఇన్‌ఛార్జి కూడా అందుబాటులో ఉంటారు.

దరఖాస్తు విధానం & ముఖ్య సూచనలు:

పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న ఆహారభద్రత కార్డుల డేటా ఆధారంగా నిర్ణీత నమూనాలో వివరాలను నమోదు చేస్తారు. దరఖాస్తు ఫారం సంఖ్యగా రేషన్ కార్డు సంఖ్యనే ఉపయోగిస్తారు. ఇతర జిల్లాలకు చెందిన రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు సైతం తమకు సమీపంలోని శిబిరంలో నమోదు చేసుకోవచ్చు.

ఆహారభద్రత కార్డు డేటాలో పేర్లు లేని, రేషన్ కార్డు లేని కుటుంబాల కోసం విడిగా ప్రత్యేక దరఖాస్తు ఫారం అందిస్తారు. వారికి ప్రత్యేక కోడ్ కేటాయించి.. బీమా సభ్యుని వివరాలు, ఆధార్ ఆధారిత జనన తేదీ, కుటుంబ వివరాలు, నామినీ వివరాలను నమోదు చేస్తారు.

ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉన్నప్పుడు రూ.5 లక్షల క్లెయిమ్ వాటాలు ఏ విధంగా వర్తిస్తాయో నమోదు సమయంలోనే అధికారులు స్పష్టంగా వివరించాలి. ప్రజల సందేహాల నివృత్తి కోసం రాష్ట్ర స్థాయిలో హెల్ప్ డెస్క్, జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.