Hyderabad: ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్!

Hyderabad: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు జరగనున్న SRH vs RCB మ్యాచ్‌కు ముందు బ్లాక్ టికెట్ల దందా కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 22 May 2026 3:52 PM IST
Hyderabad
X

Hyderabad: ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్!

Hyderabad: ఐపీఎల్ 2026 (IPL 2026) లీగ్ దశ ముగింపునకు వస్తున్న వేళ.. భాగ్యనగరంలో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా కలకలం రేపింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వెలుపల బహిరంగంగా తిరుగుతూ.. మ్యాచ్ కాంప్లిమెంటరీ (ఉచిత) పాసులను భారీ ధరలకు అమ్ముతున్న నలుగురు వ్యక్తుల ముఠాను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ (SOT) పోలీసులు శుక్రవారం రంగుపల్లాగా పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం నిందితులను తదుపరి చర్యల కోసం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ సీపీ సుమతి ఆదేశాలతో స్టేడియం పరిసరాల్లో పోలీసులు నిఘా తీవ్రం చేశారు.

నేడే SRH vs RCB హైవోల్టేజ్ మ్యాచ్ – రెట్టింపైన టికెట్ల ధరలు:

ఉప్పల్ వేదికగా నేడు (శుక్రవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య హైవోల్టేజ్ పోరు జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇది ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ఉప్పల్‌లో మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఫ్యాన్స్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం కూడా టికెట్ల ధరలను విపరీతంగా పెంచేసింది.

ఉప్పల్ స్టేడియం అధికారిక కొత్త ధరల పట్టిక ఇదే:

రూ. 950 టికెట్ ధరను ఏకంగా రూ. 2,000 కు పెంచారు.

రూ. 1,500 టికెట్ ధర ఇప్పుడు రూ. 3,000.

రూ. 1,910 టికెట్ ధరను రూ. 3,500 కు సవరించారు.

రూ. 2,500 టికెట్ ధరను రూ. 4,500 చేశారు.

రూ. 7,000 విలువైన విఐపి టికెట్ ధర రూ. 10,000 కు చేరింది.

కార్పొరేట్ బాక్స్ (రూ. 23,000 టికెట్) ధర ఏకంగా రూ. 30,000 కు పెంచేశారు.

అధికారికంగానే ధరలు అంతలా పెరిగిపోవడంతో.. సామాన్య క్రికెట్ అభిమానులు ఎలాగైనా మ్యాచ్ చూడాలనే ఆరాటంతో స్టేడియం బయట తిరుగుతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని ఉచితంగా వచ్చే కాంప్లిమెంటరీ పాసులను వేల రూపాయలకు అమ్ముతున్న ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

క్రికెట్ అభిమానులు టికెట్ల కొనుగోలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఉప్పల్ పోలీసులు హెచ్చరించారు. అనధికారిక వ్యక్తులు, దళారుల నుంచి బ్లాక్‌లో టికెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని, కేవలం అధికారిక ప్లాట్‌ఫామ్స్ ద్వారానే టికెట్లు పొందాలని సూచించారు. స్టేడియం పరిసరాల్లో మారువేషాల్లో పోలీసులు నిఘా ఉంచినట్లు స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story