Kavitha: కేసీఆర్‌వి ఉత్త కథలు.. రేవంత్‌వి పిట్ట కథలు!

Kavitha: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటు విమర్శలు చేశారు. నిన్నటి సభల్లో ఒకరు ఉత్త కథలు చెబితే, మరొకరు పిట్ట కథలు చెప్పారని ఎద్దేవా చేశారు.

Arun Chilukuri
Published on: 21 April 2026 2:34 PM IST
Kavitha
X

Kavitha: కేసీఆర్‌వి ఉత్త కథలు.. రేవంత్‌వి పిట్ట కథలు!

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నిన్న జరిగిన బీఆర్ఎస్ సభలో ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం 'ఉత్త కథలు' చెప్పారని కవిత విమర్శించారు. "రాష్ట్రంలో మక్కలు కొనే దిక్కు లేదు.. కానీ బీఆర్ఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తి మాట అనడం లేదు. ఆ పార్టీలో మహిళలకు గౌరవం లేదు, ఉద్యమకారుల ప్రస్తావనే లేదు. ఓటమికి ప్రజలే కారణమని వారిని తప్పుబట్టడం సిగ్గుచేటు" అని మండిపడ్డారు. 75 ఏళ్ల వయసులో జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరి ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కూడా ఆమె తప్పుబట్టారు. కేసీఆర్ ఉత్త కథలు చెబితే, రేవంత్ రెడ్డి పిట్ట కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. "వచ్చే పదేళ్లలో ఎవరు అధికారంలో ఉండాలో చెప్పడానికి సీఎం ఎవరు? అది ప్రజలు నిర్ణయిస్తారు. గుంట నక్క ఢిల్లీ వెళ్తే, ముఖ్యమంత్రి డీల్ కుదుర్చుకుంటున్నారని ప్రచారం చేయడం ఏంటి?" అని నిలదీశారు.

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కవిత తెలిపారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. సిరిసిల్ల నుంచి పాదయాత్రగా పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి తరలివస్తున్నామని, ఈ క్రమంలో పబ్లిసిటీ మెటీరియల్‌ను డిస్టర్బ్ చేయవద్దని జీహెచ్‌ఎంసీని కోరారు. వెయ్యేళ్లయినా బీఆర్ఎస్ పార్టీ మారదని ఆమె వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story