Jagtial: మిద్దెపై కోతుల వీరంగం.. తలపై ఇటుక పడి మహిళ మృతి!

Jagtial: జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘోరం! మిద్దెపై కోతుల వీరంగం ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది.

Arun Chilukuri
Published on: 18 Jun 2026 11:47 AM IST
Jagtial
X

Jagtial: మిద్దెపై కోతుల వీరంగం.. తలపై ఇటుక పడి మహిళ మృతి!

Jagtial: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గురువారం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో కోతుల వీరంగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మిద్దెపై కోతులు ఆడుకుంటూ అక్కడున్న భారీ సిమెంట్ ఇటుకలను కిందికి నెట్టడంతో, అవి కింద ఉన్న ఓ మహిళ తలపై పడి ఆమె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి ఇందిరమ్మ కాలనీకి చెందిన కొనపర్తి పద్మ (50) అనే మహిళ తన ఇంటి కింద మెట్ల సమీపంలో ఉంది. అదే సమయంలో వారి ఇంటి మిద్దె (డాబా) పై కోతుల గుంపు విపరీతంగా అల్లరి చేస్తూ వీరంగం సృష్టించాయి. కోతులు ఒకదానికొకటి కొట్టుకుంటూ, ఆడుకుంటూ డాబాపై నిల్వ ఉంచిన భారీ సిమెంట్ ఇటుకలను బలంగా కదిలించాయి. దీంతో ఆ ఇటుకలు పైనుంచి కిందకు పడిపోయాయి.

పైనుంచి పడ్డ ఒక భారీ సిమెంట్ ఇటుక నేరుగా కింద ఉన్న పద్మ తలపై బలంగా తగిలింది. దెబ్బ తీవ్రతకు ఆమె తల పగిలి విపరీతంగా రక్తస్రావం కావడంతో.. పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘోర ప్రమాదంతో పద్మ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న ధర్మపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనతో ధర్మపురి పట్టణంలో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇక్కడ కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయిందని మండిపడుతున్నారు. గతంలో కూడా కోతులు దాడికి రావడంతో భయపడి మిద్దె పైనుంచి కింద పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన ధర్మపురిలో జరిగింది.

గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు తరచూ స్థానికులపై, ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే స్కూల్ పిల్లలపై దాడులకు దిగుతున్నాయి. దీంతో పిల్లలను పాఠశాలలకు పంపాలన్నా, జనం రోడ్లపైకి రావాలన్నా జంకుతున్నారు. పద్మ మృతికి కారణమైన కోతుల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story