RTC Driver: ఒక్క మాటతో ఉద్యోగం పోయింది.. జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్‌కు ఊహించని షాక్

RTC Driver: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల రచ్చ పీక్స్‌కు చేరింది. జగిత్యాలలో పెట్రోల్ ధరల నిరసనలో "ముందు ధాన్యం కొనండి" అని కామెంట్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.

Arun Chilukuri
Published on: 26 May 2026 2:42 PM IST
RTC Driver
X

RTC Driver: ఒక్క మాటతో ఉద్యోగం పోయింది.. జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్‌కు ఊహించని షాక్

RTC Driver: తెలంగాణవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల (Paddy Procurement) అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలు, గిడ్డంగులు, సంచుల కొరతతో రైతన్నలు అల్లాడిపోతుంటే.. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ సమస్య కాస్తా ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రచ్చకు దారితీసింది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఊహించని ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం "ముందు ధాన్యం కొనండి" అని అన్నందుకు ఓ ఆర్టీసీ డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం సంచలనం సృష్టిస్తోంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా నాలుగు సార్లు పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జగిత్యాల బస్టాండ్ సమీపంలో విప్‌, నియోజకవర్గ ఇన్‌చార్జ్ అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ధర్నా చేపట్టారు. అదే సమయంలో జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ బస్సు నడుపుకుంటూ ఆ మార్గంలో వచ్చారు. నిరసన చేస్తున్న కాంగ్రెస్ నేతలను చూసి.. బస్సులోంచే "ముందు రైతుల దగ్గర ధాన్యం కొనండి" అంటూ గట్టిగా మాట్లాడారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో 'జెట్ స్పీడ్'లో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జగిత్యాల మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్.. డ్రైవర్ విధి నిర్వహణలో ఉంటూ కాంగ్రెస్ నాయకులను కించపరిచేలా మాట్లాడారంటూ ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా స్పందించిన జగిత్యాల డిపో మేనేజర్ (DM).. డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు (Removal Letter) తక్షణమే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఊహించని పరిణామంతో డ్రైవర్ అశోక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

ఉద్యోగం కోల్పోవడంతో డ్రైవర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. "నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. అక్కడ నిరసన చేస్తున్న వారిలో నాకు తెలిసిన వారు ఉంటే.. రైతన్నల కష్టం వర్షం పాలు అవుతుందని, ఆ బాధతోనే 'ముందు ధాన్యం కొనండి' అని అన్నాను. అంతేకాని ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఆర్టీసీ అధికారులు నన్ను విధుల్లోకి రావద్దని చెప్పి రిమూవల్ లెటర్ ఇచ్చారు. నా కుటుంబానికి అన్యాయం చేయకండి, పెద్ద మనసుతో పునరాలోచించండి" అని అశోక్ వేడుకున్నారు.

ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీ తీవ్రంగా స్పందించింది. రైతుల పక్షాన మాట్లాడినందుకు పేద డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తీసేయడం దారుణమని మండిపడింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

తక్షణమే ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను ఎలాంటి బేషరతులు లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డ్రైవర్‌కు న్యాయం జరగకపోతే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆర్ఎమ్ (RM) ఆఫీస్‌ను ముట్టడిస్తామని గంగుల కమలాకర్ గట్టిగా హెచ్చరించారు. దీంతో జగిత్యాలలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story