K Kavitha: కవిత 'పాంచజన్యం'.. ఐదు హామీలతో ఎన్నికల శంఖారావం!

K Kavitha: తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 'పాంచజన్యం' పేరుతో ఐదు భారీ హామీలను ప్రకటించారు. ఉచిత విద్య, వైద్యం నుంచి బీసీలకు 50% రిజర్వేషన్ల వరకు ఆమె చేసిన కీలక ప్రకటనల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 25 April 2026 11:26 AM IST
K Kavitha
X

K Kavitha: కవిత 'పాంచజన్యం'.. ఐదు హామీలతో ఎన్నికల శంఖారావం!

K Kavitha: నూతన రాజకీయ పార్టీ 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS)ను ప్రకటించిన కల్వకుంట్ల కవిత, తన భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. మునీరాబాద్‌ వేదికగా జరిగిన బహిరంగ సభలో ఆమె 'పాంచజన్యం' పేరుతో ఐదు సంచలన హామీలను ప్రకటించారు. సామాజిక న్యాయం, ఉచిత విద్య, వైద్యమే ధ్యేయంగా తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

కవిత ప్రకటించిన ‘పాంచజన్యం’ హామీలు ఇవే:

ఉచిత విద్య: ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు స్కూళ్లలోనూ విద్యార్థులకు పూర్తి ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేశాయని ఆమె మండిపడ్డారు.

ఉచిత వైద్యం: పేద, ధనిక తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏ వ్యాధికైనా ఉచితంగా చికిత్స అందిస్తామని ప్రకటించారు.

రైతుకు గౌరవం: రైతును రాజును చేయడమే తమ లక్ష్యమని, బ్యాంకుల్లో, ఆఫీసుల్లో రైతులకు అత్యున్నత గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉపాధి రుణాలు: కేవలం ఉద్యోగాలనే నమ్ముకోకుండా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తామని.. యువతకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

సామాజిక న్యాయం: సామాజిక తెలంగాణే లక్ష్యమని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రకులాల్లోని పేదలను కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

అమ్మలా ఆదుకుంటా..

"నేను ఒక తల్లి స్థానంలో ఉన్నాను. నేను మీ జేబు చూడను.. మీ బాగోగులు చూస్తాను" అని కవిత భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ పార్టీ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story