Kakatiya University: సీనియర్ల వేధింపులకు విద్యార్థిని బలి.. మరణ వాంగ్మూలంలో షాకింగ్ నిజాలు!
Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థిని శ్రీవిద్య మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
Kakatiya University: సీనియర్ల వేధింపులకు విద్యార్థిని బలి.. మరణ వాంగ్మూలంలో షాకింగ్ నిజాలు!
Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థిని శ్రీవిద్య మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దొంగతనం చేసావంటూ సీనియర్లు చేసిన అవమానం, శారీరక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీవిద్య.. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసింది.
అసలేం జరిగింది?
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శ్రీవిద్య, కేయూలో ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. మార్చి 5న హాస్టల్‌లోని కొందరు సీనియర్ విద్యార్థినులతో ఆమెకు వివాదం మొదలైంది. తమ వస్తువులు పోయాయని, అవి శ్రీవిద్యే తీసిందని ఆరోపిస్తూ ఆరుగురు సీనియర్లు ఆమెపై విరుచుకుపడ్డారు. తాను ఏ తప్పూ చేయలేదని మొత్తుకున్నా వినకుండా, అందరి ముందు అవమానిస్తూ మూడు రోజుల పాటు హాస్టల్ గదిలో బంధించి విచక్షణా రహితంగా దాడి చేశారు.
మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం:
సీనియర్ల వేధింపుల విషయాన్ని శ్రీవిద్య తన తల్లి అంజమ్మకు ఫోన్ ద్వారా వివరించింది. తల్లిదండ్రులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లినప్పటికీ, జరిగిన అవమానాన్ని భరించలేక శ్రీవిద్య ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమించడంతో ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఆమె ప్రాణాలు విడిచింది.
మరణ వాంగ్మూలంలో కీలక విషయాలు:
శ్రీవిద్య చనిపోవడానికి అరగంట ముందు రికార్డ్ చేసిన మరణ వాంగ్మూలం (Dying Declaration) ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. ఆ వీడియోలో తనను వేధించిన సీనియర్ల పేర్లను ఆమె వెల్లడించింది. తనను ఛాతీ కింద రబ్బర్ బ్యాండ్లతో కొట్టారని, మూడు రోజుల పాటు గదిలో వేసి చిత్రహింసలు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
నిందితులపై కేసు నమోదు:
శ్రీవిద్య తల్లి ఫిర్యాదు మరియు మరణ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇలాంటి ఘోరం జరగడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.




