Harish Rao: సత్యమే గెలిచింది.. కాళేశ్వరం విచారణపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..!
Harish Rao: కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు స్పందన. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు బట్టబయలయ్యాయని, కేసీఆర్‌పై చర్యలు తీసుకోవద్దన్న కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు.
Harish Rao: సత్యమే గెలిచింది.. కాళేశ్వరం విచారణపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..!
Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మాజీ మంత్రి టి. హరీశ్ రావు అన్నారు. ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీ పన్నిన రాజకీయ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆయన విమర్శించారు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని ఈ తీర్పుతో మరోసారి నిరూపితమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
హైకోర్టు తీర్పుపై స్పందించిన హరీశ్ రావు, "ఎన్ని కుట్రలు పన్నినా చివరకు న్యాయస్థానాల్లో న్యాయమే గెలుస్తుందని రుజువైంది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సాగిన ఈ విచారణను ధర్మాసనం తప్పుబట్టడం శుభపరిణామం" అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయం నాటకాలు ఈ తీర్పుతో బట్టబయలయ్యాయని ఆయన ధ్వజమెత్తారు.
జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ విచారణ కమిషన్ చట్టంలోని నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడటం గమనార్హం. ప్రాథమిక హక్కులను విస్మరించి జరిపిన విచారణ చెల్లదని, ఆ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావు సహా మాజీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ బురదజల్లుడు ఆపి, రైతుల ప్రయోజనాలపై దృష్టి సారించాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న బ్యారేజీ పిల్లర్లకు తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి, సాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాగా, 2024 మార్చిలో ఏర్పాటైన ఘోష్ కమిషన్, 2025 జూలైలో సమర్పించిన నివేదికలో కేసీఆర్, హరీశ్ రావులను బాధ్యులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.




