Kalvakuntla Kavitha: కవిత పొలిటికల్ చిట్‌చాట్: పవన్ కల్యాణ్ తెలంగాణ ఎంట్రీ వెనుక రేవంత్, చంద్రబాబు కుట్ర!

Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 6 Jun 2026 12:48 PM IST
Kalvakuntla Kavitha
X

Kalvakuntla Kavitha: కవిత పొలిటికల్ చిట్‌చాట్: పవన్ కల్యాణ్ తెలంగాణ ఎంట్రీ వెనుక రేవంత్, చంద్రబాబు కుట్ర!

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ చాట్ లో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, నీటి ప్రాజెక్టులు, ఇతర పార్టీల అంతర్గత వ్యూహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాదాన్ని బలహీనపరిచేందుకు పక్కా స్కెచ్ నడుస్తోందని ఆమె ఆరోపించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీదేవిపల్లి బ్యారేజీ పనులను సాధించుకునేందుకు తాము పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు కవిత వెల్లడించారు. టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అసలైన ఉద్యమం పాలమూరు నేల నుంచే ప్రారంభం కాబోతోంది. దక్షిణ తెలంగాణకు గుండెకాయ లాంటి లక్ష్మీదేవిపల్లి బ్యారేజీ నిర్మాణం కోసం త్వరలోనే తాము పాదయాత్ర చేపట్టబోతున్నాం. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. ప్రజా సమస్యల ఆధారంగా (Issue Based) రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, ఉద్యమాలు చేస్తాం.

అధికార పార్టీ నేతలు కావాలనే మా పార్టీ జెండా గద్దెలను కూల్చివేస్తున్నారు. అయినా భయపడేది లేదు. పార్టీ బలోపేతం కోసం చాలా పొలిటికల్ కన్సల్టెన్సీలు మాతో పనిచేయడానికి ముందుకు వస్తున్నాయి, కానీ మేము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మా పార్టీ పేరుపైనే దాదాపు 600 అభ్యంతరాలు వ్యక్తం చేశారంటే మా ఉనికిని చూసి ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.

రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా పుట్టుకొస్తున్న కొన్ని శక్తులపై కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న అధికార, ప్రతిపక్షాలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు కొత్త డ్రామాలకు తెరతీశారని ఆరోపించారు. ‘కాక్రోచ్ పార్టీ’ వెనుక పూర్తిగా భారతీయ జనతా పార్టీ (BJP) ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతను తగ్గించుకోవడానికే, ఇలాంటి చిన్న చిన్న పార్టీలను తెరపైకి తెచ్చి వారికి ప్రోత్సాహం అందిస్తున్నారని విమర్శించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి రావడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని కవిత సంచలన ఆరోపణ చేశారు.

"బండి సంజయ్ కి సంబంధించిన ఒక వివాదాస్పద ఇష్యూను ప్రజల్లో నుంచి డైవర్ట్ చేసేందుకే పవన్ కల్యాణ్‌ను అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయం చేయడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. ఇక్కడ బలంగా ఉన్న తెలంగాణ వాదాన్ని వీక్ చేయడమే ఆంధ్రా నాయకుల ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే.. ఇక్కడ ఆంధ్ర పెత్తనం మాత్రమే సాగాలనేది వారి కుట్ర."

అంతేకాకుండా, గతంలో వివాదంలో ఉన్న పవన్ కల్యాణ్‌కు సంబంధించిన 10 ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేంతవరకు తాము వదిలిపెట్టేది లేదని, దానిపై రాజీలేని పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story