Kamareddy: మాంసాహారం కోసం గొడవ.. భార్య విసిరిన కొడవలికి భర్త బలి!
Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాంసాహారం వండలేదన్న విషయంలో భార్య కొడవలితో విసరగా భర్త మృతి చెందాడు. క్షణికావేశంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Kamareddy: మాంసాహారం కోసం గొడవ.. భార్య విసిరిన కొడవలికి భర్త బలి!
Kamareddy: మాంసాహారం వండలేదన్న చిన్నపాటి గొడవ చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కామారెడ్డి పట్టణంలోని గోసంగికాలనీకి చెందిన కోదండం శివాజీ (28), లక్ష్మి దంపతులకు 2017లో వివాహమైంది. వీరికి ఐదేళ్లు, రెండేళ్లలోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మి ఇళ్లలో పనికి వెళ్తుండగా, శివాజీ పాత సామాన్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
శనివారం రాత్రి శివాజీ ఇంటికి చేరుకున్నాక, "మాంసాహారం ఎందుకు వండలేదు?" అని భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. స్థానికులు వచ్చి సర్దిచెప్పడంతో ఆ సమయంలో గొడవ సద్దుమణిగింది. అయితే, కొద్దిసేపటికే శివాజీ మళ్లీ తనను తిట్టడంతో లక్ష్మి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. క్షణికావేశంలో అక్కడే ఉన్న కొడవలిని భర్తపైకి బలంగా విసిరారు.
ఆ కొడవలి శివాజీ మెడలోని నరానికి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో 15 నిమిషాల వ్యవధిలోనే శివాజీ అక్కడికక్కడే మృతిచెందారు. భర్త మరణించిన విషయాన్ని గ్రహించిన లక్ష్మి, "క్షణికావేశంలో నా భర్తను నేనే చంపుకున్నాను.. ఇప్పుడు నేను జైలుకు వెళితే నా ఇద్దరు చిన్న పిల్లలను ఎవరు చూసుకుంటారు?" అని తన పిల్లలను ఒడిలోకి తీసుకుని కన్నీటిపర్యంతమయ్యారు.
సమాచారం అందుకున్న కామారెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతుడి సోదరుడు సూరి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు. ప్రస్తుతం లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.




