Karimnagar: కరీంనగర్‌లో పైప్‌లైన్ దందా.. ప్రజల దాహంతో ఆటలాడొద్దు

Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత్ పథకం పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 17 April 2026 3:12 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో పైప్‌లైన్ దందా.. ప్రజల దాహంతో ఆటలాడొద్దు

Karimnagar: కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్యలు రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతుండగా, పాత డివిజన్లతో పాటు ఇటీవల విలీనమైన డివిజన్లలో పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగర ప్రజల ప్రాథమిక హక్కైన తాగునీటిని కూడా సమయానికి అందించలేకపోతున్న , ఇప్పుడు AMRUT పథకం పేరుతో కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ఇంటింటికీ మంచినీరు అందించే విధంగా భారీ మౌలిక వసతులు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తాను మేయర్‌గా ఉన్న సమయంలోనే ఒకే రోజు 10 వేలకుపైగా నల్ల కనెక్షన్లు ఇచ్చి నగర చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించామని తెలిపారు. తీగలగుట్టపల్లి, ఆరేపల్లి, రేకుర్తి, పద్మానగర్, వల్లంపహాడ్, సీతారాంపూర్, బొమ్మకల్, గోపాలపూర్, దుర్షేడ్, చింతకుంట, మల్కాపూర్ వంటి విలీన డివిజన్లలో ఇప్పటికే పైప్‌లైన్లు, ఓహెచ్ఎస్ఆర్‌లు నిర్మించి నీటి సరఫరా బలోపేతం చేసిన విషయాన్ని స్పష్టం చేశారు.

అమృత్ పథకంలో భాగంగా పైపులు వేసేందుకు తవ్వుతూ డబ్బులు కాజేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో 3 లక్షల 76 వేల పైపులైన్లు ఉన్నాయని, CM బంధువులు కాంట్రాక్టర్గా ఉండడంతో ఏమీ మాట్లాడకుండా డబ్బులు కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం అదే ప్రాంతాల్లో మళ్లీ పైప్‌లైన్ పేరుతో రోడ్లను తవ్వి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ కోట్ల రూపాయల పనులు చూపించడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని ఆరోపించారు. “మిషన్ భగీరథ కింద ఇప్పటికే ఉన్న పైప్‌లైన్‌ను పక్కనబెట్టి మళ్లీ కొత్తగా పైప్‌లైన్ వేయడం అభివృద్ధి కాదు… ఇది బహిరంగ దోపిడీ” అని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన AMRUT పథకం G.O. 762ను ప్రస్తావిస్తూ, రూ.16 కోట్ల 77 లక్షల పనులపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. “కొద్దిగా తవ్వి, పూర్తిగా పనులు చేసినట్లు రికార్డులు సృష్టించడం… పాత పైప్‌లైన్లను కొత్తగా చూపించడం… ఇదంతా ప్రజల కళ్లకు గంతలు కట్టే కుట్ర” అని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై టెండర్ల పేరుతో నగర ప్రజల కష్టార్జిత డబ్బును దోచుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

కరీంనగర్ నగరానికి సంబంధించిన టెండర్లు వరంగల్ జిల్లాలోని సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీర్ కార్యాలయంలో నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. నగరంలో రోజుకు రావాల్సిన తాగునీరు రెండు రోజులకు ఒకసారి, అది కూడా కేవలం 20 నిమిషాలపాటు మాత్రమే అందుతుండటం పాలన వైఫల్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. మానేరు డ్యామ్‌లో నీటి మట్టం 5 టీఎంసీలకు దిగువకు పడిపోతున్నా, ముందస్తు చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని అన్నారు.

“మిషన్ భగీరథకు ఇప్పటికే ఇంటర్ కనెక్షన్ ఉన్నా దాన్ని వినియోగించకుండా, కొత్త పనుల పేరుతో నిధులు ఖర్చు చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి? అని ప్రశ్నించారు. “ప్రజలు చెల్లించే ప్రతి రూపాయి పన్ను పవిత్రమైనది. ఆ డబ్బును దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు. నగర ప్రజల దాహంతో ఆటలాడితే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ఇకపై నగరంలో ఎక్కడైనా అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటే వాటిని ఆధారాలతో సహా బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ , జిల్లా కలెక్టర్ , మున్సిపల్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story