Karimnagar: కరీంనగర్ డంపు యార్డులో మేయర్ తనిఖీలు
Karimnagar: కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ తనిఖీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో విడుదలైన నిధులతో బయోమైనింగ్ వేగవంతం.
Karimnagar: కరీంనగర్ డంపు యార్డులో మేయర్ తనిఖీలు
Karimnagar: నగర ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మా పాలకవర్గం పని చేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో బైపాస్ లో గల నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును అధికారులతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ సందర్శించారు. కొద్ది రోజులుగా డంపింగ్ యార్డ్ అంటుకొని మంటలు చెలరేగి పొగ,
దుర్వాసనతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురౌతున్న నేపథ్యంలో డంపింగ్ యార్డును తనిఖీ చేసి పరిశీలించారు. వ్యాప్తిచెందే మంటలు, పొగను వాటర్ ట్యాంకర్ల ద్వారా 3 రోజుల్లో అదుపు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డంపు యార్డు లో కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బయోమైనింగ్ వేగవంతం పై
ఏజెన్సీ, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డంపింగ్ యార్డుకు ప్రతిరోజూ సుమారు 150 నుండి 180 మెట్రిక్ టన్నుల చెత్త చేరుతుండటంతో, పేరుకుపోయిన పాత వ్యర్థాలను త్వరగా తొలగించాలని ఆదేశించారు. బయోమైనింగ్ పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ.., నిర్దేశించిన గడువులోగా చెత్తను వేరుచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీని హెచ్చరించారు.
మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ..
ప్లాస్టిక్, మట్టి, ఇతర వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి డంపింగ్ యార్డు సమస్య నుండి త్వరలో ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. బయోమైనింగ్ పనులు నిరంతరం కొనసాగేలా పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో మంటలు చెలరేగకుండా, సమీప కాలనీల ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
డంపుయార్డు ప్రక్షాలన కు కేంద్ర ప్రభుత్వం చర్యలు:
డంపింగ్ యార్డ్ ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. ఇటీవలే డంపు యార్డు ప్రక్షాలన కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసి నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.
గత 40 ఏళ్లుగా డంపుయార్డు లో చెత్త పేరుకుపోయిందని చెత్త పూర్తి స్థాయిలో ప్రక్షాలన చేసేందుకు మా పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. డంపు యార్డు లో మొత్తం 5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోగ ఇప్పటికే ఒక లక్ష మెట్రిక్ టన్నుల పైగా పాత వ్యర్థాలను శుద్ధి చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిపోయిన వ్యర్థాలను పూర్తిగా తొలగించడం జరుగుతుందని తెలిపారు. బండి సంజయ్ కుమార్ చొరవతో
స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద అదనంగా ₹2 కోట్లు నిధులను కేంద్రం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నగరాన్ని సందర్శించినప్పుడు, స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు డంపింగ్ యార్డ్ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు అవసరమైన పూర్తి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. హామి మేరకు బండి సంజయ్ కుమార్ గారు నిధులను విడుదల చేయించడం జరిగిందని తెలిపారు.
త్వరలోనే మరో బయోమైనింగ్ మిషన్ ను ఏర్పాటు చేసి రోజుకు 4 వందల టన్నుల చెత్త వ్యర్థాలను వేసి చేసి ప్రక్షాలన చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వాల సహాకారంతో డంపుయార్డు పూర్తి స్థాయిలో ప్రక్షాలన చేసి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి డంపు యార్డు ప్రక్షాలన కు 15 వ ఆర్థిక సంఘం,
స్వచ్చ్ భారత్ మిషన్ నుండి మరిన్ని నిధులు విడుదల చేయాలని సీడీఎంకు లేఖ రాయడం జరిగిందని తెలిపారు. డంపింగ్ యార్డును పూర్తిగా క్లియర్ చేసి, ఆ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడేలా సుందరీకరించడమే లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర నిధులతో చేపట్టిన ఈ పనులు పూర్తయితే మానేరు నది పరివాహక ప్రాంతంలో కాలుష్యం తగ్గి, నగరవాసులకు ఊరట లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మాసం గణేష్, చంద్ర, వసంత లక్ష్మీ భూమయ్య, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




