Karimnagar: పూల బొకేలు వద్దు.. అనాధలకు సాయం ముద్దు

Karimnagar: కరీంనగర్ ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఆర్. రవీందర్ మానవత్వం. పూల బొకేలు, శాలువాలకు బదులు అనాధలకు నిత్యవసరాలు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచిన విద్యుత్ శాఖ అధికారి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 April 2026 9:17 PM IST
Karimnagar
X

Karimnagar: పూల బొకేలు వద్దు.. అనాధలకు సాయం ముద్దు

కరీంనగర్: పదవులు మారినా, బాధ్యతలు పెరిగినా మానవత్వం మరువకూడదని నిరూపించారు కరీంనగర్ ఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ నూతన సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) ఆర్. రవీందర్. ఇటీవల బదిలీపై ఇక్కడకు వచ్చిన ఆయన, తన పదవీ బాధ్యతల స్వీకరణను ఒక సామాజిక సేవా కార్యక్రమంగా మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

శాలువాలకు బదులు నిత్యవసరాలు..

సాధారణంగా ఉన్నతాధికారులు బాధ్యతలు చేపట్టినప్పుడు సహచరులు, మిత్రులు పూల బొకేలు, శాలువాలతో సత్కరించడం ఆనవాయితీ. అయితే, ఎస్‌ఈ రవీందర్ దీనికి భిన్నంగా ఒక వినూత్న పిలుపునిచ్చారు. తనను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలకు బదులుగా.. అనాధలకు ఉపయోగపడే నిత్యవసర వస్తువులను తీసుకురావాలని సూచించారు.

అనాధాశ్రమాల్లో వస్తువుల పంపిణీ..

ఎస్‌ఈ సూచనతో స్పందించిన అధికారులు, సిబ్బంది మరియు బంధుమిత్రులు పెద్ద ఎత్తున బియ్యం, వంట నూనె, సబ్బులు, వంట దినుసులు, టవల్స్, బెడ్ షీట్లు వంటి నిత్యవసరాలను అందజేశారు. ఇలా సేకరించిన వస్తువులను ఈరోజు ఆయన స్వయంగా అనాధాశ్రమాలకు వెళ్లి పంపిణీ చేశారు.

స్పందన అనాధాశ్రమానికి సరుకులను అందజేత..

స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాధాశ్రమానికి, వెలిశాల గ్రామంలోని స్పందన అనాధ ఆశ్రమానికి సందర్శించి వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహణ తీరును నిర్వాహకులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వ్యక్తిగత, సంస్థాగత మద్దతు..

అనాధాశ్రమాల పనితీరును పరిశీలించిన ఎస్‌ఈ రవీందర్.. ఇలాంటి ఆశ్రమాలకు తన వ్యక్తిగత పరంగానే కాకుండా, సంస్థ తరపున కూడా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత హోదాలో ఉండి కూడా అనాధల పట్ల ఆయన చూపిన ఈ ఉదారతపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సేవా కార్యక్రమంలో ఎస్‌ఈ రవీందర్‌తో పాటు డిఈలు రాజం, ఎం. తిరుపతి, చంద్రమౌళి, ఏడీఈలు ఈఎల్‌పి రాజు, పంజాల శ్రీనివాస్, సుధీర్, సత్యనారాయణ మరియు ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story