Kavitha : నన్ను బయటకు పంపి, అవినీతి పందికొక్కుల్ని పక్కనపెట్టుకున్నారు

G Krishna
Published on: 25 April 2026 11:43 AM IST
trs kavitha.jpg
X

trs kavitha.jpg

TRS Kavitha : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. "తెలంగాణ రాష్ట్ర సేన (TRS)" పేరుతో సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, తన తండ్రి కేసీఆర్ , అన్న కేటీఆర్‌పై మునుపెన్నడూ లేని విధంగా విమర్శల దాడికి దిగారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూనే, ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితిపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

కేసీఆర్ మారిన మనిషి.. ఒక కర్కోటకుడి పాలన

సభా వేదికపై కవిత మాట్లాడుతూ తన తండ్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "మనం చూస్తున్న కేసీఆర్ మన పాత కేసీఆర్ కాదు.. ఆయన ఒక 'మర మనిషి' (రోబో). ప్రజలకు కష్టం వస్తే స్పందించే గుణం ఆయనలో పోయింది. ఆయన ఇప్పుడు గుంటనక్కల చేతిలో ఇరుక్కున్నారు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన పాత కేసీఆర్ అయి ఉంటే పాలమూరు ప్రాజెక్టును ఎప్పుడో పూర్తి చేసేవారని, కానీ ఈ 'మారిన కేసీఆర్' పంజాబ్ వెళ్లారని, జాతీయ రాజకీయాలంటూ తెలంగాణను విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇళ్లు కూలుస్తుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు.

అవినీతి పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు

తన బహిష్కరణపై స్పందిస్తూ, "నా బిడ్డ లేదా కొడుకు తప్పు చేస్తే పార్టీ నుంచి తీసేస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నన్ను బయటకు పంపారు.. కానీ అసలైన అవినీతి పందికొక్కులను మాత్రం తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు" అని ధ్వజమెత్తారు. ఉద్యమకారులను పార్టీ నుంచి పంపివేసిన రోజే తాను మాట్లాడాల్సిందని, కానీ ఆలస్యంగానైనా ఇప్పుడు వాస్తవాలు చెబుతున్నానని అన్నారు. ఉద్యమంలో మనల్ని కొట్టిన వారికే ఇప్పుడు బీఆర్ఎస్‌లో పట్టం కట్టారని, ఉద్యమకారులను అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు.

సిగ్గుపడుతున్నా.. గర్వపడుతున్నా

తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ, ప్రజలు కన్న కలలు నెరవేరలేదని కవిత పేర్కొన్నారు. "రాష్ట్రం దారి తప్పింది.. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైంది. గతంలో పాలించిన కుటుంబంలో (కేసీఆర్ ప్రభుత్వం) నేను కూడా భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నాను. కానీ, తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు మాత్రం గర్వపడుతున్నాను" అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛ లేదని, దారుణమైన నిఘా నీడలో తెలంగాణ బతుకుతోందని ఆమె విమర్శించారు.

జాగృతి పునాది.. భవిష్యత్తు అధికారం

తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక పునాది వేసింది తన 'తెలంగాణ జాగృతి' అని కవిత గుర్తు చేశారు. బతుకమ్మ పండుగను ప్రపంచానికి పరిచయం చేసి, మన సంస్కృతిని కాపాడుకున్నామని చెప్పారు. ఇక తన రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ.. "ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. ఇన్ ఫ్రంట్ దేరీస్ క్రొకడైల్ ఫెస్టివల్ (ముందుంది అసలైన పండగ). రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రిని ఏమనాలి?" అని ప్రశ్నించారు. ఇప్పటి నుంచి తమ పార్టీయే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమని, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది కూడా తామేనని ధీమా వ్యక్తం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story