Kavitha : కేసీఆర్ బిడ్డగా కాదు.. ప్రజా నాయకురాలిగా వస్తున్నా.. కవిత కొత్త పార్టీ వెనుక వ్యూహం ఇదేనా?
Kavitha : తెలంగాణలో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. పార్టీ జెండా, ఎజెండాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Kavitha
Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న ఆమె, నేడు (శనివారం) సొంత రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో తన పార్టీ జెండా, ఎజెండాను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
మునీరాబాద్ సభ.. అట్టహాసంగా ఏర్పాట్లు
మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని అద్వయ కన్వెన్షన్ ఈ చారిత్రాత్మక సభకు వేదికగా మారింది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సభ ప్రాంగణానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును పెట్టడం గమనార్హం. ఉదయం 10 గంటలకు పార్టీ ప్రకటన ఉంటుందని సమాచారం. బంజారాహిల్స్ నివాసం నుంచి బయలుదేరి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం కవిత సభా స్థలికి చేరుకుంటారు. సభ ముగిశాక లిబర్టీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన కార్యాచరణను ప్రారంభిస్తారు.
తెలంగాణ ప్రజా జాగృతి.. జెండా ఇదేనా?
పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని ఉండబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన కవిత, ఇప్పుడు దానికి రాజకీయ రంగు అద్దబోతున్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను, బతుకమ్మ సంస్కృతిని మిళితం చేస్తూ కొత్త పార్టీ ఎజెండా రూపొందించినట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్‌తో విబేధాలు.. విడిపోయిన బాట
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కవిత బీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా మారుతారని అందరూ భావించారు. కానీ పార్టీ అంతర్గత వ్యవహారాలు, లీకుల పర్వంతో ఆమె విసిగిపోయారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొంతమంది కీలక నేతలు (హరీష్ రావు, జగదీష్ రెడ్డి వంటి వారు) తనను దూరం పెడుతున్నారని ఆమె గతంలోనే ఆరోపించారు. చివరకు సెప్టెంబర్ 2న పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో ఆమె తన సొంత దారిని వెతుక్కున్నారు. తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌తో విబేధాల గురించి నేటి సభలో ఆమె ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.
ఉద్యమ నేపథ్యం నుంచి కొత్త పార్టీ వరకు
2006లో తెలంగాణ జాగృతి స్థాపించి బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో కవిత కీలక పాత్ర పోషించారు. 2014లో ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఆమెకుంది. జైలు జీవితం, ఆపై కోర్టు నుంచి క్లీన్ చిట్ పొందిన తర్వాత ఆమెలో రాజకీయ పరిపక్వత పెరిగిందని అభిమానులు అంటున్నారు. గత అక్టోబర్‌లో నాలుగు నెలల పాటు ఆమె చేసిన పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన స్పందనే ఈ కొత్త పార్టీ ఏర్పాటుకు పునాది అని తెలుస్తోంది. సుమారు గంటన్నర పాటు సాగే ఆమె ప్రసంగంలో బీఆర్‌ఎస్‌లోని లోపాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టబోతున్నట్లు సమాచారం.




