KCR Jagtial Public Meeting: కేసీఆర్ సభకు కేటీఆర్ ఎందుకు రాలేదు? గులాబీ దళం ఇచ్చిన అసలు క్లారిటీ ఇదే!
KCR Jagtial Public Meeting: జగిత్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగం. కేటీఆర్, హరీష్ రావు గైర్హాజరీపై రాజకీయ వర్గాల్లో చర్చ.
KCR Jagtial Public Meeting: కేసీఆర్ సభకు కేటీఆర్ ఎందుకు రాలేదు? గులాబీ దళం ఇచ్చిన అసలు క్లారిటీ ఇదే!
KCR Jagtial Public Meeting: చాలా నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలలో నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'తో రాజకీయంగా మరోసారి వేడి పుట్టించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే, పార్టీలో అత్యంత కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావులు ఈ సభకు దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్య నేతల గైర్హాజరీపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వర్గాలు దీనిపై స్పష్టత ఇచ్చాయి. గత కొద్దిరోజులుగా ఎండలు తీవ్రంగా ఉండటంతో కేటీఆర్ వడదెబ్బకు గురయ్యారని, అస్వస్థత కారణంగానే ఆయన జగిత్యాల సభకు హాజరుకాలేకపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు, మాజీ మంత్రి హరీష్ రావు న్యాయపరమైన పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు మరియు ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించేందుకు కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ స్పష్టం చేసింది.
ఢిల్లీలో హరీష్ రావుతో పాటు వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్రలు సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యమా సుందరంతో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో, తదుపరి కార్యాచరణపై వీరు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవైపు కేసీఆర్ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తుండగా, మరోవైపు హరీష్ రావు నేతృత్వంలోని బృందం ఢిల్లీలో న్యాయపోరాటానికి సిద్ధమవుతుండటం గమనార్హం.




