Khairatabad Bada Ganesh: ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్లు ఇవే.!
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా సెప్టెంబర్ 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, రూట్లు, పార్కింగ్ వివరాలు ఇవి.
Khairatabad Bada Ganesh
ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠాత్మక బడా గణేష్ విగ్రహ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 24 వరకు పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమలు చేయనున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు రద్దీకి అనుగుణంగా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
వాహనాల మళ్లింపు మార్గాలు
వీవీ విగ్రహం వైపు నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
పాత పీఎస్ సైఫాబాద్ వైపు నుంచి రాజ్ దూత్ లేన్ మీదుగా బడా గణేష్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రాజ్ దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు.
ఇక్బాల్ మినార్ వైపు నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ వైపు వెళ్లే వాహనాలను మింట్ కాంపౌండ్ లైన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
నెక్లెస్ రోటరీ వైపు నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు.
నిరంకారి వైపు నుంచి ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా రైల్వే గేట్ వైపు వెళ్లే వాహనాలను పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ఈ ప్రాంతాల్లో భారీ రద్దీ
బడా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్, అయోధ్య, నిరంకారి, పాత పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ జంక్షన్, నెక్లెస్ రోటరీ, కేసీపీ జంక్షన్, మాసాబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
సాధారణ ప్రయాణికులు ఈ మార్గాల్లో ప్రయాణించకుండా వీలైనంత వరకు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్
బడా గణేష్ దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తులు రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలం లేదా ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలను పార్క్ చేసుకోవచ్చు.
ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే భక్తులకు విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
అత్యవసర ప్రయాణ సమయంలో ట్రాఫిక్‌కు సంబంధించిన సహాయం కోసం 9010203626 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరారు.




