Khairatabad Ganesh: శోభాయాత్రగా తరలివెళ్తున్న బడా గణేశుడు.. ట్యాంక్‌బండ్ వద్ద అంబరాన్ని తాకిన భక్తి కోలాహలం!

Khairatabad Ganesh: హైదరాబాద్‌లో వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ట్యాంక్‌బండ్ వద్ద భారీ భద్రత మధ్య నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 25 Sept 2026 11:39 AM IST
Khairatabad Ganesh: శోభాయాత్రగా తరలివెళ్తున్న బడా గణేశుడు.. ట్యాంక్‌బండ్ వద్ద అంబరాన్ని తాకిన భక్తి కోలాహలం!
X

Khairatabad Ganesh: హైదరాబాద్ నగరంలో గణేశ్‌ నిమజ్జన కోలాహలం అంబరాన్ని తాకింది. ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు ప్రసిద్ధ ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

తొలుత బడా గణేశుడిని ప్రత్యేక టస్కర్‌ వాహనంపైకి చేర్చి, విగ్రహం చుట్టూ వెల్డింగ్‌ పనులు పూర్తి చేశారు. సాంకేతిక కారణాల వల్ల ఉదయం ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర కొద్దిగా ఆలస్యమైనప్పటికీ, భక్తుల జయధ్వానాల మధ్య యాత్ర ముందుకు సాగుతోంది.

సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు శోభాయాత్ర చేరుకుంటుంది. ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్‌ నంబర్‌ 5 వద్ద 69 అడుగుల మహాగణపతి నిమజ్జనం పూర్తికానుంది.

శోభాయాత్ర ప్రారంభ సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు మహాగణపతి ఎదుట ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలతో పాటు నగరవ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజధాని శివారు నుంచి నడిబొడ్డు వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నాలుగు కమిషనరేట్ల పరిధిలో అసాధారణ స్థాయిలో 45 వేల మంది పోలీసులతో భద్రతను కల్పించారు. కేవలం హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లోనే వెయ్యి మంది పోలీసులు నిమజ్జన విధుల్లో నిమగ్నమయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.