Khammam: ‘నాన్నా ఈ చొక్కా బాగుంది’ అంటూనే.. కళ్లముందే ప్రాణం వదిలిన కొడుకు!
Khammam: ఖమ్మం జిల్లా వైరాలో విషాదం. దసరా సెలవులకు ఇంటికొచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థి రాఘవ (19) తండ్రి కళ్లముందే గుండెపోటుతో మృతిచెందాడు.
Khammam: ‘నాన్నా ఈ చొక్కా బాగుంది’ అంటూనే.. కళ్లముందే ప్రాణం వదిలిన కొడుకు!
Khammam: దసరా పండుగ వేళ ఖమ్మం జిల్లాలో అత్యంత హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పండుగ సెలవుల కోసం సంతోషంగా ఇంటికి వచ్చిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తల్లిదండ్రుల కళ్లముందే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడు గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబంలోనే కాకుండా గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.
వైరా పదో వార్డు కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, విజయ దంపతుల కుమారుడు రాఘవ (19). ఈయన హైదరాబాద్లోని ఒక కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా పండుగను కుటుంబంతో గడపడానికి రెండ్రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు.
శుక్రవారం ఉదయం దుస్తులు అమ్మే వ్యక్తి ఇంటి ముందుకు రాగా, రాఘవ నిద్రలేచి బయటకు వచ్చి "నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి" అని తండ్రితో అంటూనే మంచంపై నుంచి ఒక్కసారిగా కిందపడిపోయాడు.
కొడుకు ఒక్కసారిగా కుప్పకూలడంతో కంగారుపడిన తల్లిదండ్రులు, సోదరి తక్షణమే సీపీఆర్ (CPR) చేసి, ఆటోలో వైరాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు రాఘవ అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు ధృవీకరించారు.
చదువులో రాణిస్తూ అందరితో సరదాగా ఉండే 19 ఏళ్ల రాఘవ చిన్న వయసులోనే గుండెపోటుతో మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెట్టారు.




