USA: వాకింగ్ చేస్తూ తండ్రితో ఫోన్ మాట్లాడిన అక్షిత.. అమెరికాలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన యువతి!

USA: ఖమ్మం వర్తక సంఘం నేత కుమార్తె అక్షిత (26) అమెరికాలోని న్యూయార్క్ ఆల్బనీలో గుండెపోటుతో మృతి చెందారు. తండ్రితో ఫోన్ మాట్లాడిన కొద్దిసేపట్లోనే ఈ విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 23 Oct 2026 5:41 PM IST
USA
X

USA: వాకింగ్ చేస్తూ తండ్రితో ఫోన్ మాట్లాడిన అక్షిత.. అమెరికాలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన యువతి!

USA: అమెరికాలో ఉంటూ ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న తెలుగు యువతి గుండెపోటుతో హఠాన్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఖమ్మం వర్తక సంఘం దిగుమతి శాఖ అధ్యక్షులు నల్లమల్ల ఆనంద్ కుమార్తె నల్లమల్ల అక్షిత (26) అమెరికాలో అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. ఈ దారుణ ఘటనతో ఖమ్మంలోని ఆమె కుటుంబంలో, స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఖమ్మం నగరానికి చెందిన అక్షిత ఎంఎస్ (MS) చదివేందుకు నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్ రాష్ట్రంలోని ఆల్బనీ (Albany) ప్రాంతంలో తన సోదరుడు అక్షయ్‌తో కలిసి నివసిస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అక్షిత తన ఇంటి వద్ద వాకింగ్ చేస్తూ ఖమ్మంలో ఉన్న తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు.

అలా తండ్రితో మాట్లాడి లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి, గది బయటికి వచ్చిన సోదరుడు అక్షయ్ పరిశీలించగా.. అక్షిత కిందపడిపోయి అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అప్రమత్తమైన ఆమె సోదరుడు, తోటి విద్యార్థుల సహాయంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్షితను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే గుండెపోటు (Cardiac Arrest)తో మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

తండ్రితో ఆప్యాయంగా మాట్లాడిన కుమార్తె క్షణాల వ్యవధిలోనే విగతజీవిగా మారాడమన్న వార్త తెలిసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ హఠాత్పరిణామంతో ఖమ్మం వర్తక సంఘం సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్లమల్ల ఆనంద్ కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శిస్తున్నారు. అమెరికా నుంచి అక్షిత పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి ఖమ్మం తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు మరియు ఇక్కడి ప్రముఖులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.