Kishan Reddy: దక్షిణాదికి అన్యాయం జరగదు.. రేవంత్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా
Kishan Reddy: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు.
Kishan Reddy: దక్షిణాదికి అన్యాయం జరగదు.. రేవంత్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా
Kishan Reddy: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు మహిళా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. "మేం కూడా దక్షిణాది వారమే, ఇక్కడి రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వం" అని ఆయన హామీ ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ ప్రక్రియ జరుగుతుందని, దీనికి సుమారు రెండేళ్ల సమయం పడుతుందని వివరించారు. బీజేపీ మంత్రులకు భవిష్యత్తులో చప్రాసీ పదవి కూడా రాదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. "రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఆయన ఢిల్లీకి డబ్బులు మోసుకెళ్తున్నారు" అంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో అటువంటి సంస్కృతి లేదని, కేవలం పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మొత్తానికి డీలిమిటేషన్ అంశం రెండు పార్టీల మధ్య పరస్పర వ్యక్తిగత దూషణలకు దారితీయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




