Kishan Reddy: సింగరేణిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోచేశాయి: కిషన్ రెడ్డి
Kishan Reddy: సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయింపుపై ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Kishan Reddy: సింగరేణిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోచేశాయి: కిషన్ రెడ్డి
Kishan Reddy: సింగరేణి సంస్థకు ఒడిశాలోని 'నైనీ కోల్ బ్లాక్' కేటాయించినందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సింగరేణి భరోసా యాత్ర’ ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు.
గతంలో బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలను ప్రస్తావిస్తూ... కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకతకు పెద్దపీట వేసిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు అన్ని బొగ్గు గనులను కేవలం వేలం (Auction) ద్వారానే కేటాయిస్తూ వచ్చామని, అయితే సింగరేణి సంస్థను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వేలం ప్రక్రియ లేకుండా సింగరేణికి కేటాయించిన ఏకైక బ్లాక్ 'తాడిచర్ల-2' అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, ముడుపులు తీసుకుని మైన్స్ కేటాయించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ అక్రమ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ, బొగ్గు గనుల కేటాయింపులు అత్యంత పారదర్శకంగా జరగాలని ఆదేశించిందని పేర్కొన్నారు. సింగరేణిలో ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలే కారణమని మండిపడ్డారు.
గత పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు. "సింగరేణిలో బొగ్గు మాయమైందంటూ ఇప్పుడు కేటీఆర్, హరీశ్ రావు లేఖలు రాస్తున్నారు. సింగరేణి వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదనే విషయం మీకు తెలియదా?" అని ప్రశ్నించారు. సింగరేణి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ... "మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు సింగరేణి డబ్బులను ఖర్చు చేస్తారా?" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కేంద్రానికి సమాచారం ఇవ్వడం లేదని, అయినప్పటికీ సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పెత్తనం చెలాయించబోదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.




