Kishan Reddy: రేవంత్ రెడ్డిది 'హైబ్రిడ్' కాదు.. అది ఒవైసీ ఫార్ములా!: డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy: దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకుండా డీలిమిటేషన్ జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములాను ఒవైసీ ఫార్ములాగా అభివర్ణించారు.
Kishan Reddy: రేవంత్ రెడ్డిది 'హైబ్రిడ్' కాదు.. అది ఒవైసీ ఫార్ములా!: డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు.
ఒవైసీ కనుసన్నల్లోనే కాంగ్రెస్, బీఆర్ఎస్!
కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ ఫార్ములా ఆయనది కాదని, అది అసదుద్దీన్ ఒవైసీ ఫార్ములా అని ఎద్దేవా చేశారు. ఎంఐఎం డైరెక్షన్‌లోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుస్తున్నాయని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లకు ఎంఐఎం మొదటి నుంచీ వ్యతిరేకమని, ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను కలిపింది కూడా ఎంఐఎం పార్టీయేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డీలిమిటేషన్ జరిగితే కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుందనే భయంతోనే ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని ఆయన విమర్శించారు.
అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం
అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్ల పెంపు ఉండాలనే నిర్ణయం తీసుకుంటే, దానిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయంగా ఈ ప్రక్రియను చేపడుతుందని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ఆయన భరోసా ఇచ్చారు.




