Konda Surekha: "ఆమెను తీసేస్తారా.. నన్ను వెళ్లిపోమంటారా?": సీఎం రేవంత్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు

Konda Surekha: తెలంగాణ కేబినెట్ నుంచి తన బర్తరఫ్‌ వెనుక పెద్ద కుట్ర ఉందంటూ మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.

Arun Chilukuri
Published on: 3 Sept 2026 5:33 PM IST
Konda Surekha
X

Konda Surekha: "ఆమెను తీసేస్తారా.. నన్ను వెళ్లిపోమంటారా?": సీఎం రేవంత్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తొలగింపు వెనుక సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కొందరి కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కూతురు సుస్మిత మాట్లాడిన మాటలను ఆయుధంగా మార్చుకుని తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన మంత్రి పదవి తొలగింపులో పూర్తిగా కుట్ర కోణం ఉందని కొండా సురేఖ స్పష్టం చేశారు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరూ కలిసి తనపై కుట్రలు పన్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆమెను తీసేస్తారా.. నన్ను వెళ్లిపోమంటారా.. అని బ్లాక్ మెయిల్ రాజకీయం చేసి మరీ నన్ను బర్తరఫ్ చేయించారు" అని తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. తన కూతురు సుస్మిత ఒక ఇండిపెండెంట్ మహిళ అని, ఆమె చెప్పిన అభిప్రాయాలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. సుస్మితతో తాము ఎప్పుడూ మాట్లాడించలేదని, ఆమె వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

రాజీనామా అడిగితే కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం ఉండేదని, కానీ ఎలాంటి కారణం చెప్పకుండానే తనను బర్తరఫ్ చేశారని వాపోయారు. అసలు తాను సీఎంపై గానీ, పార్టీపై గానీ ఒక్క మాటా అనలేదని స్పష్టం చేశారు. తనకు వచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చినా, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా రికమండేషన్ల మేరకే ఈ చర్యలు తీసుకున్నారన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని, ఇందిరాగాంధీని తీవ్రంగా విమర్శించిన వారంతా నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని, కానీ నిన్న తన కూతురు ఏదో మాట్లాడిందని తనపై కక్ష తీర్చుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కాంగ్రెస్‌ను విమర్శించిన వారందరికీ పదవులు ఇచ్చి సన్మానించిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. "రూ.50 కోట్లు ఇచ్చి సీఎం పదవిని కొనుక్కున్నారని మీ మీద ఆరోపణలు చేసిన వారికి కూడా చైర్మన్ పదవులు ఇచ్చారు" అని పరోక్షంగా విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానిపై సర్వే చేయించాలని సూచించారు. తాను పార్టీకి రాజీనామా చేయడం లేదని, కాంగ్రెస్‌లోనే ఉంటూ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని కొండా సురేఖ తేల్చిచెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story