Konda Surekha: తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ..
Konda Surekha: కేటీఆర్‌పై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న మాజీ మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ కుటుంబానికి విచారం తెలుపుతూ ఎక్స్‌లో సంచలన పోస్ట్.
Konda Surekha: తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ..
Konda Surekha: తెలంగాణ రాజకీయంలో తీవ్ర దుమారం రేపిన సంచలన వివాదానికి తెరపడింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పై గతంలో తాను చేసిన ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలను మాజీ మంత్రి కొండా సురేఖ ఉపసంహరించుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా గురువారం ప్రకటన విడుదల చేసిన ఆమె, ఆనాడు తాను చేసినవి నిరాధారమైన వ్యాఖ్యలని అంగీకరిస్తూ విచారం వ్యక్తం చేశారు.
కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలనుకుంటున్నట్లు స్పష్టం చేసిన కొండా సురేఖ, అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యానే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
"అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలోనే కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలు చేశాను. అంతే తప్ప అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావు. ఆనాడు నేను చేసిన నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. నా వ్యాఖ్యలు వారిని, వారి కుటుంబ సభ్యులను నొప్పించి ఉంటే తీవ్రంగా చింతిస్తున్నాను. అప్పుడు నేను చేసిన వ్యాఖ్యలన్నింటినీ పూర్తిస్థాయిలో ఉపసంహరించుకుంటున్నాను." అని కొండా సురేఖ ట్వీట్ చేసారు.
గతంలో కొండా సురేఖ కేటీఆర్ లక్ష్యంగా కొన్ని తీవ్రమైన వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపడమే కాకుండా, కాంగ్రెస్-బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధానికే దారితీశాయి. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించడమే కాకుండా, లీగల్ నోటీసులు కూడా పంపారు.
అటు అధిష్టానం వద్ద కూడా ఈ వ్యవహారం చర్చకు రావడంతో, చివరకు కొండా సురేఖ బహిరంగంగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ 'ఎక్స్' వేదికగా క్షమాపణలు కోరడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




