Konda Surekha: మంత్రి పదవితో పాటు, కాంగ్రెస్ పార్టీకి కొండా గుడ్ బై..?

Konda Surekha: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అధిష్టానం, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ తర్వాత మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు.

Gagan kumar
Published on: 3 Sept 2026 1:06 PM IST
Konda Surekha
X

Konda Surekha: మంత్రి పదవితో పాటు, కాంగ్రెస్ పార్టీకి కొండా గుడ్ బై..?

Konda Surekha Resignation: ఢిల్లీ వేదికగా సాగిన తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం వేడి ఒక్కసారిగా పరాకాష్టకు చేరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు, ఆమె కుమార్తె వివాదాస్పద కామెంట్స్, దానికి తోడు కాంగ్రెస్ అధిష్టానం వద్ద రీసెంట్‌గా జరిగిన భేటీల నేపథ్యంలో రాజీనామా డ్రామా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఢిల్లీలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన కొండా సురేఖ, తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తన వెర్షన్‌ను వినిపించారు. అయితే, పార్టీ క్రమశిక్షణ, అంతర్గత విమర్శల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్గం గట్టిగా పట్టుబట్టడంతో, అధిష్టానం సురేఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతోంది.

స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, లేదంటే బర్తరఫ్ తప్పదని అధిష్టానం తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతుండగా, సురేఖ మాత్రం నేను రాజీనామా చేసేది లేదు.. ధైర్యముంటే బర్తరఫ్ చేసుకోండి అని బహిరంగంగా సవాల్ విసిరారు.

తాను బీసీ వర్గానికి చెందిన నాయకురాలినని, తనపై మాత్రమే చర్యలు తీసుకోవడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నిస్తూ.. పార్టీలోని మరికొందరు మంత్రులపై కూడా విమర్శలు గుప్పించారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ చేరుకున్న కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తమ సుదీర్ఘ రాజకీయ అనుచరులతో అత్యవసరంగా సమావేశమవుతున్నారు.

మధ్యాహ్నం జరగబోయే మీడియా సమావేశంలో వారు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది తీవ్ర ఆసక్తి కలిగిస్తోంది.

అధిష్టానం బర్తరఫ్ చేసే దాకా ఆగకుండా, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి స్వయంగా రాజీనామా లేఖను పంపడం. కేవలం పదవి మాత్రమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి కూడా శాశ్వతంగా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేసే అవకాశం ఉంది.

కొండా దంపతులు కాంగ్రెస్‌ను వీడితే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం మారనుంది. స్వతంత్రంగా ఉండటమా లేక మరేదైనా ప్రధాన ప్రతిపక్షంలో చేరడమా అన్నది తేలాల్సి ఉంది.పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో కొండా దంపతులకు బలమైన అనుచరగణం ఉంది.

వారి నిష్క్రమణ కాంగ్రెస్‌కు స్థానికంగా పెద్ద షాకే అని చెప్పాలి. తాను బీసీ నేతనవడం వల్లే బలిపశువును చేస్తున్నారని సురేఖ చేసిన కామెంట్స్, కాంగ్రెస్ పార్టీ బీసీ ఓటు బ్యాంక్ సమీకరణాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ తిరిగి రావడం, సరిగ్గా అదే సమయంలో కొండా దంపతులు ప్రెస్ మీట్ పెట్టడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను పెంచేసింది. కొండా సురేఖ రాజీనామా బాంబు పేలుస్తారా..? లేదా అధిష్టానమే బర్తరఫ్ ఉత్తర్వులు జారీ చేస్తుందా? అన్నది కొన్ని గంటల్లో స్పష్టం కానుంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story