KTR: ‘బండి సంజయ్ రేవంత్‌రెడ్డికి బీ-టీమ్‌లా మారారు’..
KTR: కరీంనగర్ ఘటనపై కేటీఆర్ ఘాటు స్పందన. గంగుల క్యాంప్ ఆఫీసుపై దాడిని ఖండించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు.
KTR: ‘బండి సంజయ్ రేవంత్‌రెడ్డికి బీ-టీమ్‌లా మారారు’..
KTR: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు జరిపిన ఈ దాడిని ‘హేయమైన చర్య’గా ఆయన అభివర్ణించారు. దాడి జరిగిన వెంటనే కౌశిక్‌రెడ్డికి ఫోన్ చేసిన కేటీఆర్, ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పట్టపగలు గూండాల మాదిరిగా కార్యాలయంలోకి చొరబడి వాహనాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. "కళ్ల ముందే ఇంత అరాచకం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటు. శాంతిభద్రతలను కాపాడాల్సిన వారే చోద్యం చూడటం ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి తన అనుచరులతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. "ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బీ-టీమ్‌లా మారారు. బీఆర్‌ఎస్ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఇలాంటి దాడులకు ఉసిగొల్పుతున్నారు" అని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేక హింసకు పాల్పడటం బండి సంజయ్ అసమర్థతకు నిదర్శనమని కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.




