KTR: ఒక్క ఊరిలో అయినా వంద శాతం రుణమాఫీ అయిందా? రేవంత్‌కు కేటీఆర్ సవాల్!
KTR: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
KTR: ఒక్క ఊరిలో అయినా వంద శాతం రుణమాఫీ అయిందా? రేవంత్‌కు కేటీఆర్ సవాల్!
KTR: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ పనులు మాత్రం గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటానని చెప్పిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట తప్పి కాంగ్రెస్‌లో చేరారని కేటీఆర్ విమర్శించారు. భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోచారంతో పాటు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ హయాంలో రైతులకు అవసరమైన అన్నీ ఇళ్ల వద్దకే వచ్చేవని గుర్తు చేసిన కేటీఆర్.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని, మోటార్లు కాలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కనీసం యూరియా కూడా అందించలేకపోతున్నారని మండిపడ్డారు. "రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. కనీసం 30 నుండి 40 శాతమైనా పూర్తి చేశారా?" అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క ఊరిలో అయినా వంద శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీలోనే సవాల్ విసిరానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 11 సార్లు రైతుబంధు నిధులు వేశామని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రజలకు తెలిసిపోతుందనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి నీళ్లు వదలడం లేదని కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో కుంగిన రెండు పిల్లర్లకు ఇప్పటివరకు మరమ్మతులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దేశంలో ఎల్‌నినో (El Nino) ప్రభావం వస్తుందని శాస్త్రవేత్తలు ఆరు నెలల ముందే హెచ్చరిస్తే.. ఈ ప్రభుత్వం ఇప్పుడు సమీక్షలు చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి సరైన ప్రణాళిక లేకుండా సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన సాగిస్తున్నారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.




