KTR: అసెంబ్లీలో రేవంత్ దోపిడీని నిలదీస్తామనే సస్పెండ్ చేశారు

KTR: సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీని ప్రశ్నిస్తామనే తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 10 Sept 2026 3:17 PM IST
KTR
X

KTR: అసెంబ్లీలో రేవంత్ దోపిడీని నిలదీస్తామనే సస్పెండ్ చేశారు

KTR: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుటుంబం చేస్తున్న అవినీతి, దోపిడీని శాసనసభలో నిలదీస్తామనే భయంతోనే బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలు గాలికి వదిలేసి, కేవలం రేవంత్ రెడ్డి కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని విమర్శించారు. రూ.200 కోట్ల విలువైన భూమిని సీఎం సోదరుడి కంపెనీకి కట్టబెట్టడంపై ప్రశ్నిస్తారనే తమను సభ నుంచి బయటకు పంపారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టిన కేటీఆర్.. అనుముల అన్నదమ్ముల దోపిడీపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీలు పెట్టారని, దోచుకున్న సంపదను దాచుకునేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.

ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు బలిపశువులు కావద్దని కేటీఆర్ హితవు పలికారు. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు ఉండదని తేల్చిచెప్పారు. దీనిపై రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సదస్సులు నిర్వహించి ప్రజలకు వివరిస్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి అన్ని మార్గాల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే ఈ భూ కేటాయింపులపై ఈడీ (ED) విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. భవిష్యత్‌లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భూములను అసలు పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.

తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే నేరుగా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు. సీఎం టీమ్ సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాను సృష్టించి అసెంబ్లీని తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. ఆ ఫేక్ ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story