KTR: ముఖ్యమంత్రికి డబ్బుల సంచులపై ఉన్న శ్రద్ధ.. ధాన్యం సంచులపై లేదు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!
KTR: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వైఫల్యం, శాంతిభద్రతల క్షీణతపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
KTR: ముఖ్యమంత్రికి డబ్బుల సంచులపై ఉన్న శ్రద్ధ.. ధాన్యం సంచులపై లేదు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!
KTR: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు సాగక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం రైతుల కంటే డబ్బుల సంచులపైనే ఎక్కువ దృష్టి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు (గోనె సంచులు) దొరకడం లేదు కానీ.. గన్స్ మాత్రం దొరుకుతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. "కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటివరకు పది మందికి పైగా రైతులు చనిపోయారు. కానీ సివిల్ సప్లై మంత్రి మాత్రం రైతులెవరూ చనిపోలేదని బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. రైతులను ఎక్కువ రోజులు ఏడిపిస్తే, విసిగిపోయి తక్కువ ధరకు అమ్ముకుంటారనేదే ఈ దరిద్రపు ప్రభుత్వ ఆలోచన. కొడంగల్‌లో ఎంత ధాన్యం కొన్నారో చూసేందుకు నేను సిద్ధం.. ఏ ప్లేస్, ఏ సెంటర్ అయినా రమ్మనండి చూసుకుందాం" అని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెయ్యి మంది రైతులు చనిపోయారని, కేబినెట్ మీటింగ్‌లో వారి కుటుంబాలను ఆదుకునేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అనే దరిద్రం ఉన్నంత కాలం రాష్ట్రానికి కష్టాలు తప్పవని కేటీఆర్ విమర్శించారు. రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి 'భూ భారతి' ద్వారా చేస్తున్న దోపిడీని త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ప్రభుత్వానికి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన ప్రణాళిక లేదని, సీఎం 20 శాతం ధాన్యం కొన్నామంటే.. మంత్రి 50 శాతం అంటున్నారని, అసలు ఎంత కొన్నారో అధికారికంగా 'శ్వేతపత్రం' విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కేసీఆర్ ఆదేశాల మేరకు తమ పార్టీ ఓపికగా ఉందని, ఇకపై రైతుల పక్షాన ఎక్కడికక్కడ విస్తృత ధర్నాలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగితే కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదని, నిందితుడిని కాపాడింది ఎవరని ప్రశ్నించారు. "రాష్ట్ర డీజీపీకి అసలు తలకాయ ఉందా? రేవంత్ రెడ్డి తన చంచల్‌గూడ బ్యాచ్‌తో అందరినీ చంపుతారా? ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ తోడు దొంగలు. ప్రధాని రేవంత్ చెవిలో నన్ను కాపాడమని చెప్పారా? అందుకే తెలంగాణలో రేవంత్ రెడ్డికి అంత స్పెషల్ ట్రీట్‌మెంట్ ఆ?" అని ప్రశ్నించారు. పోలీసులు దొంగలైన పాలకుల వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.
తన బావమరిది ఫామ్‌హౌస్‌లో తప్పు దొరికితే కేసు పెట్టుకోవచ్చని కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీలోనే తాము డ్రగ్స్ టెస్టులు చేయించుకుందామని అడిగామని గుర్తు చేశారు. అలాగే పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకే పైలట్ రోహిత్ రెడ్డిని గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు.




