KTR: "తులం బంగారం కాదు.. తులం ఇనుము కూడా ఇవ్వరు".. కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు!

KTR: ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 5:32 PM IST
KTR: తులం బంగారం కాదు.. తులం ఇనుము కూడా ఇవ్వరు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు!
X

KTR: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను నమ్మించి నట్టేట ముంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలపై పదునైన విమర్శలు గుప్పించారు.

కేటీఆర్ తన ప్రసంగంలో లేవనెత్తిన ప్రధానాంశాలు:

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజలను ఘోరంగా మోసం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చిన పథకం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.

రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి దాదాపు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. ఈ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రకు ఈ ప్రభుత్వం తెరలేపింది.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. కోటీశ్వరుల ముచ్చట పక్కన పెడితే.. కనీసం లక్షాధికారులను కూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

"కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని నమ్మబలికింది. కానీ ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే తులం బంగారం కాదు కదా.. కనీసం తులం ఇనుము కూడా ఇచ్చే పరిస్థితి లేదు."

కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story