BRS: గన్ పార్క్ వద్ద గులాబీ దండు నిరసన.. ఆరు గ్యారంటీలే టార్గెట్!

BRS: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసన. ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్. "రాహుల్ బంధు కాదు.. రైతుబంధు కావాలి" అంటూ నినాదాలు.

Arun Chilukuri
Published on: 16 March 2026 11:18 AM IST
BRS: గన్ పార్క్ వద్ద గులాబీ దండు నిరసన.. ఆరు గ్యారంటీలే టార్గెట్!
X

BRS: గన్ పార్క్ వద్ద గులాబీ దండు నిరసన.. ఆరు గ్యారంటీలే టార్గెట్!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయ సెగలు రాజుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో పూర్తిస్థాయి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ నివాళులర్పించి, ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన గన్ పార్క్

నిరసన సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా "రాహుల్ బంధు కాదు.. రైతుబంధు కావాలి" అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. రైతులకు వెన్నుపోటు పొడిచి, ఢిల్లీకి వందల కోట్లు తరలిస్తున్నారని వారు ఆరోపించారు.

బీఆర్‌ఎస్ ప్రధాన డిమాండ్లు ఇవే:

ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో పాటు, వాటికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తామన్న నెలకు ₹2500 సాయం ఏమైందని, మహాలక్ష్మి పథకాన్ని అటకెక్కించారని విమర్శించారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి మాట తప్పారని, పేదవాడి నడ్డి విరుస్తున్నారని నినదించారు.

మహిళలను నట్టేట ముంచారని, రైతులకు ఇచ్చిన భరోసాను విస్మరించారని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు స్పష్టమైన కేటాయింపులు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story