KTR: ఇంకో ఏడాది మాత్రమే రేవంత్ హడావుడి.. తర్వాత వచ్చేది కేసీఆరే
KTR: అంబర్పేట్ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడుతూ.. మరో ఏడాదిలోనే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
KTR: ఇంకో ఏడాది మాత్రమే రేవంత్ హడావుడి.. తర్వాత వచ్చేది కేసీఆరే
KTR: గత అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డమైన మాటలు, అబద్ధపు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) విమర్శించారు. అంబర్పేట్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రాజధాని హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ అసలు రంగును ముందుగానే గుర్తించి, గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా తిరస్కరించారని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన 'పిచ్చోడి చేతిలో రాయి'లా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎల్నినో ప్రభావంపై పది నెలల ముందే అలెర్ట్ చేసినప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేడు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేక రైతులు తీవ్ర గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుప్పకూలిందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని, చివరికి రాహుల్ గాంధీని సైతం తీసుకువచ్చి అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసే ఇలాంటి చిల్లర ప్రచారాలను ప్రజలు ఇక ఎంతమాత్రం నమ్మరని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటేనని, కేసీఆర్పై విమర్శలు చేయాల్సి వస్తే ఆ రెండు పార్టీలు ఒక్కటవుతాయని కేటీఆర్ ఆరోపించారు. "రేవంత్ రెడ్డి దున్నపోతు ఈనింది అంటే.. కిషన్ రెడ్డి దూడను కట్టేయ్" అనేలా వారి తీరు ఉందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా సంక్షేమం పక్కనపడి 'లూటీ పాలన' నడుస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడావుడి ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమేనని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్కు ఓటు వేసి, మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఎదురుచూస్తున్నారని కేటీఆర్ తెలిపారు.




