KTR: పుష్కర తెలంగాణను ముష్కరుల తెలంగాణగా మార్చేశారు..

KTR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 2 Jun 2026 12:21 PM IST
KTR
X

KTR: పుష్కర తెలంగాణను ముష్కరుల తెలంగాణగా మార్చేశారు..

KTR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం 'తెలంగాణ భవన్'లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన తెలంగాణను ప్రస్తుత పాలకులు సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, అధినేత కేసీఆర్ చేసిన త్యాగాలను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు కేసీఆర్ ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అనే నినాదంతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ అనే మూడు అక్షరాల ముందు 'ముఖ్యమంత్రి' అనే పదవి చాలా చిన్నది" అని వ్యాఖ్యానించారు. ఒక అంతర్జాతీయ దర్శకుడు కేసీఆర్ బయోపిక్ తీస్తానని తనను సంప్రదించినప్పుడు.. 'ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కానివ్వండి, తర్వాత చూద్దాం' అని కేసీఆర్ చెప్పిన ఉదంతాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. నల్లగొండలో దశాబ్దాల నాటి ఫ్లోరైడ్ రక్కసిని మిషన్ భగీరథ ద్వారా శాశ్వతంగా పారద్రోలిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.

ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "పుష్కర కాలం పాటు వెలిగిపోయిన తెలంగాణ.. ఇప్పుడు ముష్కరుల చేతుల్లో పడి నిష్ఫల తెలంగాణగా, సంక్షోభాల తెలంగాణగా మారిపోయింది. వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని తెచ్చి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే.. దాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మారుస్తున్నారు" అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు హామీలు, అడ్డదారుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలను పూర్తిగా దెబ్బతీస్తోందని ఆరోపించారు.

బీఆర్ఎస్ (BRS) ఎన్నికల ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. 2014, 2018 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోరాడి భారీ విజయాలు సాధించామని కేటీఆర్ చెప్పారు. గత 2023 ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగి కేవలం స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి చెందామని గుర్తు చేశారు. అయితే ఈ కాంగ్రెస్ మార్కు అరాచక పాలన ఎంతో కాలం సాగదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే 2028 డిసెంబర్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పి, మరోసారి బీఆర్ఎస్‌కు పట్టం కడతారని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story