KTR: దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం కానున్నారు.. కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!

KTR: తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలు, సీజేపీ పోరాటాలు, రైతుల విద్యుత్ సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 23 Oct 2026 2:55 PM IST
KTR
X

KTR: దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం కానున్నారు.. కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు! 

KTR: రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక పాత్ర పోషించబోతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి హడావుడి కొద్దిరోజులు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మోదీ పాలన వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని, అదే సమయంలో బీజేపీని ఢీకొట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేతకానితనం వల్లే నేడు యువత 'సీజేపీ' (Cockroach Janta Party - CJP) వంటి కొత్త వేదికల పేరుతో రోడ్లెక్కి పోరాటాలు చేయాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో గొంతు విప్పేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు వేయకపోవడం వల్ల విద్యుత్ కొరత ఏర్పడి రైతులు తీవ్ర అల్లాడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని నిపుణులు 10 నెలల ముందే అలెర్ట్ చేసినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి బీఆర్‌ఎస్ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన అన్ని వర్గాల ప్రజలు, యువత మళ్లీ బీఆర్‌ఎస్ వైపే చూస్తున్నారని, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు యువత, నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.