Venugopalapuram: రైతన్న ఆవేదన ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఐదేళ్ల నిరీక్షణ!
Venugopalapuram: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో లో-ఓల్టేజీ సమస్యతో పంటలు ఎండిపోతున్నాయి.
Venugopalapuram: రైతన్న ఆవేదన ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఐదేళ్ల నిరీక్షణ!
Venugopalapuram: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామంలో సాగునీటి కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గత ఐదేళ్లుగా పీడిస్తున్న లో-ఓల్టేజీ సమస్య కారణంగా కళ్లముందే పంటలు ఎండిపోతుంటే, ఏం చేయాలో దిక్కుతోచక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌పై ఏకంగా 35 వ్యవసాయ మోటర్లతో పాటు గ్రామ పంచాయతీ కనెక్షన్లు ఉండటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. విద్యుత్ లోడ్ అధికమవ్వడంతో ఓల్టేజీ అందక మోటర్లు నడవటం లేదు. ఒకవేళ నడిచినా లో-ఓల్టేజీ వల్ల మోటర్లు కాలిపోతున్నాయి. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు నీరు అందక నెర్రెలు బారుతుంటే, రైతులు గుండె తరుక్కుపోతోందని ఆవేదన చెందుతున్నారు.
కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతులు ఐదేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అధికారులు నేటికీ స్పందించలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగినా 'రేపు మాపు' అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప పరిష్కారం చూపడం లేదని రైతులు మండిపడుతున్నారు. విసిగిపోయిన రైతన్నలు చివరకు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు.




