LPG Pipeline: తెలంగాణకు మోదీ ప్రభుత్వం బిగ్ గిఫ్ట్.. రూ.7 వేల కోట్లతో కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్
LPG Pipeline: ప్రస్తుతం మనదేశంలో ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ పొడవు సుమారు 7,700 కిలోమీటర్లుగా ఉంది.
LPG Pipeline
LPG Pipeline: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ.7,000 కోట్ల భారీ అంచనా వ్యయంతో 1,800 కిలోమీటర్ల మేర నూతన ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు 556 కిలోమీటర్ల మేర కొత్త పైప్‌లైన్ మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ GAIL ఈ నిర్మాణ బాధ్యతలను స్వీకరించనుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే తెలంగాణలో వంటగ్యాస్ నిల్వలు, సరఫరా మౌలిక వసతులు మరింత పటిష్టమవుతాయి.
ఐదు రాష్ట్రాలను అనుసంధానించే నెట్‌వర్క్
ఈ నూతన పైప్‌లైన్ నెట్‌వర్క్ ఐదు ప్రధాన రాష్ట్రాల గుండా సాగనుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు ఈ గ్రిడ్ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు వేర్వేరు మార్గాలను ప్రతిపాదించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ వరకు 611 కిలోమీటర్లు, మహారాష్ట్రలోని షిక్రాపూర్ నుంచి గోవా, కర్ణాటకలోని హుబ్లీ వరకు 633 కిలోమీటర్ల పైప్‌లైన్లు అందుబాటులోకి రానున్నాయి.
9,500 కిలోమీటర్లకు పెరగనున్న నెట్‌వర్క్
ప్రస్తుతం మనదేశంలో ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ పొడవు సుమారు 7,700 కిలోమీటర్లుగా ఉంది. ఈ నూతన ప్రాజెక్టులు పూర్తయితే ఈ సంఖ్య ఏకంగా 9,500 కిలోమీటర్లకు విస్తరిస్తుంది. పైప్‌లైన్ మార్గాల ద్వారా గ్యాస్ రవాణా పెరగడం వల్ల రోడ్డు, రైలు మార్గాలపై ఉన్న భారం తగ్గుతుంది. అనుకోని విపత్తులు లేదా రవాణా సమస్యలు ఎదురైనప్పుడు కూడా వినియోగదారులకు గ్యాస్ కొరత రాకుండా ఈ వ్యవస్థ తోడ్పడుతుంది.
సురక్షితమైన రవాణా, స్థిరమైన సరఫరా
రోజురోజుకూ పెరుగుతున్న ఎల్‌పీజీ అవసరాలకు అనుగుణంగా రీఫిల్లింగ్ ప్లాంట్లు, బాట్లింగ్ ప్లాంట్లు, నిల్వ కేంద్రాల మధ్య మెరుగైన అనుసంధానం చాలా అవసరం. ప్రమాద రహితంగా, తక్కువ ఖర్చుతో గ్యాస్ సరఫరా చేయడానికి పైప్‌లైన్ నెట్‌వర్క్ ఎంతో ఉపయోగపడుతుంది. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఉన్న ప్రధాన పంపిణీ కేంద్రాలను ఇది అనుసంధానించడం వల్ల భవిష్యత్తులో గ్యాస్ కొరత అనేదే ఉండదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ నిర్మాణంతో దేశంలో వంటగ్యాస్ రవాణా వ్యవస్థ స్వరూపమే మారనుంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ప్రజలకు నిరంతరాయంగా, ఎలాంటి అంతరాయం లేకుండా వంటగ్యాస్ అందుబాటులో ఉండేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది.




