Mahabubabad: చెరువుపై తండావాసుల దండయాత్ర.. రూ.1.5 లక్షల విలువైన చేపలు లూటీ!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గోపాతండాలో మృగశిర కార్తె సాకుతో స్థానికులు ఒక చేపల చెరువుపై పడి లూటీ చేశారు.

Arun Chilukuri
Published on: 7 Jun 2026 11:15 AM IST
Mahabubabad
X

Mahabubabad: చెరువుపై తండావాసుల దండయాత్ర.. రూ.1.5 లక్షల విలువైన చేపలు లూటీ!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఒక విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. మృగశిర కార్తె సమీపిస్తున్న తరుణంలో.. ఓ తండావాసులు ఏకంగా చేపల చెరువుపై పడి అందులోని చేపలన్నింటినీ లూటీ చేశారు. వలలు, చీరలు, లుంగీలు.. ఎవరికి ఏది దొరికితే దాంతో పోటీపడి మరీ చేపలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో చెరువు పరిసర ప్రాంతాలన్నీ చిన్నపాటి జాతరను తలపించాయి.

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం గోపాతండా శివారులోని 'బంధంకుంట' చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. తండాలోని ఆడ-మగ, చిన్న-పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ ఒక్కసారిగా చెరువుపై దండయాత్ర చేశారు. పోటాపోటీగా చేపలు పట్టి సంచుల్లో నింపుకున్నారు. ఆనందంగా దొరికిన చేపలను దొరికినట్లే ఇళ్లకు తీసుకెళ్లి ఫ్రై, పులుసు చేసుకొని పండుగ చేసుకున్నారు. మృగశిర కార్తె వస్తుండటంతో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని, అందుకే వేటాడామని తండావాసులు చెబుతున్నారు.

తండావాసులంతా పండుగ చేసుకుంటే.. ఆ చెరువును నమ్ముకున్న మత్స్యకారులు మాత్రం రోడ్డున పడ్డారు. ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఈ బంధంకుంట చెరువును ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. ఎంతో పెట్టుబడి పెట్టి, రాత్రింబవళ్లు కష్టపడి చేప పిల్లలను పెంచారు. తీరా వాటిని పట్టి మార్కెట్లో అమ్ముకునే సమయానికి తండావాసులు ఇలా దాడి చేసి లూటీ చేయడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ దాడుల వల్ల తమకు సుమారు రూ. 1,50,000 (లక్షన్నర రూపాయల) విలువైన చేపలు నష్టం వాటిల్లాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ లూటీ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story