Mahabubnagar: ప్రియురాలి కోసం జైలు గోడ దూకిన ఖైదీ.. నాలుగు టవల్స్ ముడేసి ఎస్కేప్!

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుండి పోక్సో కేసు రిమాండ్ ఖైదీ కిశోర్ కుమార్ సినిమా ఫక్కీలో పరారయ్యాడు.

Arun Chilukuri
Published on: 6 July 2026 2:24 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: ప్రియురాలి కోసం జైలు గోడ దూకిన ఖైదీ.. నాలుగు టవల్స్ ముడేసి ఎస్కేప్!

Mahabubnagar: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్ర సబ్ జైలులో సోమవారం తెల్లవారుజామున సంచలన ఘటన చోటుచేసుకుంది. జైలు నిబంధనలు, కట్టుదిట్టమైన భద్రతను అభాసుపాలు చేస్తూ ఒక రిమాండ్ ఖైదీ సినిమా స్టైల్‌లో జైలు గోడ దూకి పరారయ్యాడు. పోక్సో (POCSO) కేసులో అరెస్టయిన సదరు ఖైదీ.. జైలు క్యాంటీన్‌లో పనిచేస్తూ, ఎవరూ గమనించని సమయంలో పక్కా ప్లాన్‌తో ఎస్కేప్ కావడం కలకలం రేపింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్‌ కుమార్‌ (22) అనే యువకుడు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో (పోక్సో చట్టం కింద) గత 25 రోజుల క్రితం అరెస్టయి మహబూబ్‌నగర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. జైలులోని క్యాంటీన్‌లో ఇతనికి పని కేటాయించారు. అయితే, సోమవారం ఉదయం బ్యారెక్‌లో ఉన్న కిశోర్ కుమార్.. తోటి సిబ్బందితో తాను బాత్రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చాడు.

అప్పటికే ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్న కిశోర్ కుమార్.. నాలుగు స్నానం చేసే టవల్స్‌ను ఒకదానికొకటి గట్టిగా ముడి వేశాడు. ఆ టవల్స్ తాడును జైలు లోపలి గోడపై అమర్చి, దాని సహాయంతో అత్యంత చాకచక్యంగా గోడ దూకి అవతలికి పారిపోయాడు.

నిందితుడు కిశోర్ కుమార్ ప్రియురాలు ప్రస్తుతం వనపర్తి జిల్లాలోని 'సఖి' (Sakhi Centre) ఆశ్రయ కేంద్రంలో ఉంది. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రాణాలకు తెగించి జైలు నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది.

కేంద్ర జైలు నుంచి ఖైదీ పరారైన సమాచారం లీక్ కావడంతో జైలు అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై జోగులాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ ఎస్‌ చౌహాన్‌ వెంటనే స్పందించారు. జైలు సూపరింటెండెంట్‌ శశికాంత్‌తో ఫోన్‌లో మాట్లాడి, భద్రతా వైఫల్యాలపై పూర్తి వివరాలు ఆరా తీశారు. ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతానికి మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పారిపోయిన రిమాండ్ ఖైదీ కిశోర్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story