Wedding Feast : పెళ్లి పాయసం.. ఆస్పత్రి ప్రయాణం.!
Wedding Feast : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో మిగిలిపోయిన 'కద్దు కా కీర్' (సొరకాయ పాయసం) వికటించి పదుల..
Payasam
Wedding Feast : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో మిగిలిపోయిన 'కద్దు కా కీర్' (సొరకాయ పాయసం) వికటించి పదుల సంఖ్యలో కాలనీవాసులు ఆస్పత్రి పాలయ్యారు. జిల్లా కేంద్రంలోని న్యూమోతీనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెళ్లి పాయసమే కదా అని ఇష్టంగా తిన్న చిన్నారులు, పెద్దలు కాసేపటికే వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మిగిలిన పాయసం పంచడంతోనే ముప్పు
స్థానిక సమాచారం ప్రకారం.. న్యూమోతీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి వివాహం ఇటీవల ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. అయితే, వివాహ విందులో భాగంగా గురువారం రాత్రి తయారు చేసిన కద్దు కా కీర్ పాయసం భారీగా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన పాయసాన్ని పారేయడం ఇష్టం లేక, శుక్రవారం మధ్యాహ్నం తర్వాత పెళ్లి నిర్వాహకులు కాలనీ వాసులకు పంపిణీ చేశారు. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా కాలనీలోని చాలామంది ఆ పాయసాన్ని తిన్నారు. నిల్వ ఉంచిన పాయసం కావడం వల్ల అది అప్పటికే పాడైపోయింది. ఫలితంగా, పాయసం తిన్న కాసేపటికే ఒకరి తర్వాత ఒకరు వరుసగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు.
ఆస్పత్రిలో చేరిన బాధితులు.. నిలకడగా ఆరోగ్యం
తీవ్రంగా వాంతులు చేసుకోవడంతో సుమారు 30 మందికి పైగా కాలనీవాసులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులందరినీ వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో దాదాపు 20 మంది రాత్రంతా ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందగా, మిగిలిన వారు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 13 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవాళ్లు ఉన్నారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారు సాధారణ స్థితికి చేరుకోగానే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.
పరామర్శించిన నేతలు, అధికారులు
ఫుడ్ పాయిజనింగ్ ఘటన గురించి తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రికి చేరుకొని బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం ఉదయం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ ఏ. శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు ఆసుపత్రిని సందర్శించి బాధితుల ఆరోగ్యంపై ఆరా తీశారు. కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేయాలని వైద్యులకు సూచించారు.
కలెక్టర్ అప్రమత్తత.. అధికారులకు ఆదేశాలు
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా తీవ్రంగా స్పందించారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పంపిణీ చేసే క్రమంలో వాటి నాణ్యతను ఖచ్చితంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వివిధ ప్రాంతాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో, ప్రజలు కూడా నిల్వ ఉన్న ఆహారాన్ని తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.




