Mahesh Kumar Goud: పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవు.. మహేశ్‌ కుమార్‌గౌడ్ వార్నింగ్

Mahesh Kumar Goud: పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ హెచ్చరించారు.

Arun Chilukuri
Published on: 20 Aug 2026 11:58 AM IST
Mahesh Kumar Goud
X

Mahesh Kumar Goud: పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవు.. మహేశ్‌ కుమార్‌గౌడ్ వార్నింగ్

Mahesh Kumar Goud: కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా, పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు మాట్లాడినా కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్టీ నాయకులు చిన్నారెడ్డి, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ తెలిపారు. "మంత్రి కొండా సురేఖ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరాం. ఇప్పటికే ఈ విషయమై నిన్ననే వారికి షోకాజ్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. క్రమశిక్షణ కమిటీకి వారి నుంచి వివరణ వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం" అని మహేశ్‌ గౌడ్‌ వెల్లడించారు.

మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఆయన మాట్లాడారు. పోచారంతో స్వయంగా మాట్లాడామని, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామని తెలిపారు. అయితే, ముందస్తుగా ఎవరికి వారు పోటీ చేస్తామని ప్రకటనలు చేయడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ ఇవ్వాలనేది కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మరియు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మాత్రమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

22ఏ భూముల వ్యవహారంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని మహేశ్‌ గౌడ్‌ విమర్శించారు. కిందిస్థాయిలో జరిగిన పొరపాట్లను, తప్పిదాలను వెంటనే సరిదిద్దాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story