Preethi Reddy : బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతిరెడ్డి
Preethi Reddy: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నేత మల్లారెడ్డి స్టైలే వేరు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి, చర్చ ఖచ్చితంగా ఉంటాయి.
Preethi-Reddy
Preethi Reddy: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నేత మల్లారెడ్డి స్టైలే వేరు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి, చర్చ ఖచ్చితంగా ఉంటాయి. అయితే, గత కొంతకాలంగా మల్లారెడ్డి రాజకీయ అడుగులపై రాష్ట్రవ్యాప్తంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, నేడు ఆయన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యక్షమవ్వడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ భేటీతో మల్లారెడ్డి కుటుంబం త్వరలోనే 'కమలం' తీర్థం పుచ్చుకోబోతుందా? అనే చర్చకు తెరలేచింది.
బీజేపీ ఆఫీసులో గంటపాటు భేటీ..
నేడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న డాక్టర్ ప్రీతిరెడ్డి, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా గదిలో జరిగిన ఈ సమావేశం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఇతర పార్టీల నేతలు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రత్యర్థి పార్టీ కార్యాలయానికి రావడం అనేది కేవలం మర్యాదపూర్వకమే అని చెప్పినప్పటికీ, దాని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మల్లారెడ్డి తన రాజకీయ వారసురాలిగా ప్రీతిరెడ్డిని ప్రమోట్ చేస్తున్నారా..? లేక కుటుంబం మొత్తం పార్టీ మారడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రధాని మోదీతో భేటీ వెనుక అసలు రహస్యం అదేనా.?
ఇటీవలే మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అప్పట్లో ఆ భేటీపై వివరణ ఇస్తూ.. తమ ఏఐసిటి (AICT) యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించేందుకే వెళ్లామని మల్లారెడ్డి చెప్పారు. అయితే, ప్రధానిని కలిసిన కొద్ది రోజుల్లోనే కోడలు ప్రీతిరెడ్డి రాష్ట్ర బీజేపీ నేతలతో వరుస భేటీలు నిర్వహించడం చూస్తుంటే, ఆ ఢిల్లీ పర్యటన వెనుక కేవలం యూనివర్సిటీ ఆహ్వానం మాత్రమే లేదని, ఏదో పెద్ద రాజకీయ ఒప్పందం జరిగి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రీతిరెడ్డి వివరణ
బీజేపీ కార్యాలయంలో భేటీ ముగిసిన అనంతరం మీడియాలో వస్తున్న వార్తలపై డాక్టర్ ప్రీతిరెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఆమె ప్రాథమికంగా కొట్టిపారేశారు. "నేను ఒక విద్యావేత్తను. విద్యాసంస్థల అభివృద్ధిలో భాగంగా అన్ని పార్టీల నాయకులను కలుస్తుంటాను. ఈ రోజు బీజేపీ నాయకులను కలిసింది కూడా కేవలం మర్యాదపూర్వకంగానే. నేను ఇప్పుడు బీజేపీలో చేరడం లేదు. మా మామ మల్లారెడ్డి ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నారు" అని ఆమె స్పష్టం చేశారు. ప్రధాని మోదీని కలిసింది కూడా కేవలం విద్యాసంస్థ కార్యక్రమం కోసమేనని ఆమె పునరుద్ఘాటించారు.
విద్యా సంస్థల రక్షణ కోసమేనా?
రాజకీయ విశ్లేషకులు మాత్రం మల్లారెడ్డి ఫ్యామిలీ అడుగులను మరో కోణంలో చూస్తున్నారు. మల్లారెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా భారీ విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, తన విద్యా సంస్థలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవడంతో పాటు, తన కుటుంబానికి రాజకీయ రక్షణ కల్పించుకోవడమే మల్లారెడ్డి ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం లేదా రాబోయే రోజుల్లో కీలక బాధ్యతలపై బీజేపీ అగ్రనేతలతో మల్లారెడ్డి మంతనాలు జరుపుతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
త్వరలోనే పొలిటికల్ ట్విస్ట్.?
మల్లారెడ్డి కుటుంబం తమ పర్యటనలను 'విద్యా సంస్థల' సాకుతో కప్పిపుచ్చుతున్నప్పటికీ, వరుసగా బీజేపీ నేతలతో భేటీ అవుతుండటం చూస్తుంటే.. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపు ఉండబోతోందని అర్థమవుతోంది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న తరుణంలో, మల్లారెడ్డి వంటి సీనియర్ నేత కమలం గూటికి చేరితే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తుంది. రానున్న రోజుల్లో ఈ కుటుంబం అధికారికంగా ఎప్పుడు కాషాయ కండువా కప్పుకుంటుందో చూడాలి..




